పాల ఉత్పత్తిపై లంపి దెబ్బ! : మధుసూదన్ రెడ్డి

పాడి పశువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ‘లంపీ స్కిన్‌’‌ వ్యాధి వార్త పిడుగులా భయపెడుతున్నది. లంపీ స్కిన్‌ వ్యాధి పట్ల కుప్పలు తెప్పలుగా వాస్తవాలు, అవాస్తవాలు సామాజిక మాద్యమల్లో చక్కర్లు కొట్టడంతో పాడి రైతాంగం అయోమయంలో పడుతున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2.4 మిలియన్ల పాడి పశువులు(ఆవులు, గేదెలు) వైరస్‌ బారినపడగా, మరో 1.10 లక్షల పశువులు చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. లంపీ స్కిన్‌ వ్యాధి తీవ్రత రాజస్థాన్‌లో అధికంగా ఉందని నివేదికలు చెపుతున్నాయి. ఈ వ్యాధి రాజస్థాన్‌తో పాటు గుజరాత్​, యూపీ, పశ్చిమ బెంగాల్​, మధ్యప్రదేశ్​ వంటి 18 రాష్ట్రాలకు చెందిన 251 జిల్లాల్లో 20 లక్షల పశువులకు సోకిందని కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య తెలిపింది. వ్యాధి ప్రభావంతో ఒక్క రాజస్థాన్‌ రాష్ట్రంలోనే రోజుకు 6 లక్షల లీటర్ల పాల దిగుబడి పడిపోయిందని తేలింది. ప్రపంచంలోనే అత్యంత పశు జనాభా, అతి పెద్ద పాల ఉత్పత్తి కలిగిన దేశంగా భారత్‌కు పేరుంది. 

వైరస్‌ టీకాలు..

1929లోనే లంపీ స్కిన్‌ వైరస్‌ను జాంబియాలో గుర్తించారు. అక్కడి నుంచి కాలక్రమంలో సబ్‌-సహారా ఆఫ్రికా, ఉత్తర ఆఫ్రికా, మిడిల్‌ ఈస్ట్‌, యూరోప్‌, ఆసియా దేశాల్లోకి వ్యాపించింది. ఆసియా ఖండంలో 2019 జులై తర్వాత బంగ్లాదేశ్, చైనా, ఇండియా‌ల్లో గుర్తించారు. బంగ్లాదేశ్‌ నుంచి ఈ వైరస్‌ ఇండియాలోకి ప్రవేశించినట్లు తెలుస్తున్నది. భారత సైంటిస్టులు లంపీ స్కిన్‌‌ వ్యాధికి స్వదేశీ టీకాలను(లంపీ- ప్రో వ్యాక్‌ ఇండ్‌ టీకా) అభివృద్ధి చేశారని, వాణిజ్య వాడకానికి కొంత సమయం పట్టవచ్చని తెలుస్తున్నది. ఇండియాలో ఇప్పటికే10 మిలియన్లకు పైగా పశువులకు ‘గోట్‌ ఫాక్స్‌ టీకా’లు వేశామని, ఈ టీకాలు 80 శాతం వరకు సత్ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. లంపీ స్కిన్‌ వైరస్‌ సోకిన పశువులకు 28 రోజుల తర్వాత అధిక జ్వరం, శరీరంపై ముద్దలు ఏర్పడటం, శ్వాస ఇబ్బందులు, కండ్లు/ముక్కుల నుంచి నీరు కారడం, ఆకలి మందగించడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన పశువుల నుంచి పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. లంపీ స్కిన్‌ వైరస్‌ ద్వారా సోకే ఈ వ్యాధి ఒక పశువు నుంచి మరోదానికి సంక్రమిస్తుంది. ఈగలు, దోమలు, టిక్స్‌ కాటు ద్వారా ఒక జంతువు నుంచి మరో జంతువుకు రక్తం ద్వారా సోకుతుంది. నోరు, ముక్కు నుంచి కారే ద్రవాల(కుడితి/తాగే నీరు/పశుగ్రాసం/వీర్యం) ద్వారా కూడా చేరుతుందని తెలుపుతున్నారు. అతి ప్రమాదకర అంటువ్యాధి కాబట్టి వైరస్‌ సోకిన పశువులను వేరు చేసి చికిత్సలు చేయడం ఉత్తమం.. 

పాడి రైతుల జీవనోపాధి

లంపీ స్కిన్‌ వ్యాధి తీవ్రత పెరిగితే దేశ పాడి రైతుల ఆర్థిక స్థితి, పాడి పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తులను అందిస్తున్న రైతులను ప్రభుత్వాలు సత్వరమే ఆదుకునే చర్యలు తీసుకోవాలి. వ్యాధి సోకకుండా టీకాలను దేశ నలుమూలల ఉన్న అన్ని పశువులకు ఉచితంగా అందించాలి. చిన్న సన్న కారు రైతుల జీవనోపాధి పాల ఉత్పత్తులపై  ఆధారపడి ఉంటుంది. పాడి పరిశ్రమతో గ్రామీణ జీవితాలు చాలా మేరకు ముడిపడి ఉన్నాయి. పాడి ఉత్పత్తిదారులను లంపీ స్కిన్‌ వైరస్‌ విపత్తు నుంచి కాపాడుకోవడం,శ్వేత విప్లవానికి ఊతం ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత.

వైరస్‌ సోకిన పశువు పాలను తాగొచ్చా?

లంపీ స్కిన్‌ వ్యాధి సోకిన పశువుల పాలను తాగడం మానవ ఆరోగ్యానికి హానికరమనే అవాస్తవ వార్తలతో రైతులు, పాల ఉత్పత్తుల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. లంపీ స్కిన్‌ వ్యాధి జునోటిక్‌ వ్యాధి(జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులు) వర్గంలోనిది కాదని, వైరస్‌ సోకిన ఆవుల పాలు తాగిన వారికి ప్రమాదమేమీ ఉండదని సైంటిస్టులు చెపుతున్నారు. వ్యాధి సోకిన ఆవు పాలు తాగిన దూడలకు ఈ వ్యాధి రావచ్చని హెచ్చరిస్తున్నారు. జంతువు నుంచి జంతువుకు వ్యాపించగల లంపీ స్కిన్‌ వైరస్‌ వ్యాధి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలకు సోకే ప్రమాదం ఉందని గుర్తించారు. జంతువు నుంచి మనిషికి ఈ వైరస్‌ సోకదని నిర్ధారించారు. అయినప్పటికీ పాలను నేరుగా కాకుండా శుద్ధి చేసిన, పాశ్చరైజ్డ్‌ పాలను వాడటం మంచిదని సైంటిస్టులు సూచిస్తున్నారు. పాలను మరిగించడం ద్వారా వైరస్‌ నశిస్తుందని చెబుతున్నారు. 

- మధుసూదన్ రెడ్డి, సోషల్ ఎనలిస్ట్