అక్టోబర్ 28న చంద్రగ్రహణం..యాదగిరిగుట్ట టెంపుల్ బంద్

యాదగిరిగుట్ట/శ్రీశైలం, వెలుగు : పాక్షిక చంద్రగ్రహణం వల్ల శనివారం సాయంత్రం 4 గంటల నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మూసివేయనున్నట్లు ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు. శనివారం రాత్రి 1:05 గంటల నుంచి రాత్రి 2:22 గంటల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఉందని వివరించారు. ఈ కారణంగా తిరువాదన, నివేదన, శయనోత్సవం తదితర పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. సాయంత్రం 4 గంటలకు నారసింహుడి ప్రధానాలయంతో పాటు పాతగుట్ట టెంపుల్, అనుబంధ ఆలయాలు, ఉపాలయాలను మూసివేయనున్నట్లు చెప్పా రు. ఆదివారం తెల్లవారుజామున మళ్లీ గుడి తలుపులు తెరిచి ఆలయంలో సంప్రోక్షణ పూజలు చేస్తామన్నారు. తర్వాత దర్శనాలను పునరుద్ధరిస్తామన్నారు.

శ్రీశైలం టెంపుల్ మూసివేత

చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని శనివారం సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో  పెద్దిరాజు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 29వ తేదీన ఉదయం 5 గంటలకు ఆలయశుద్ధి, సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజలు చేస్తామని, 7 గంటల నుంచి భక్తులను దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, ఇతర ఆర్జిత సేవలకు అనుమతిస్తామని వివరించారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే సర్వదర్శనం చేసుకోవచ్చన్నారు. ప్రధానాలయంతో పాటు పరివార ఆలయాలు కూడా మూసివేస్తామన్నారు. భక్తులకు ఉచిత అన్నదాన వితరణ కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుందని ఈవో పేర్కొన్నారు.