ఎడారిలో మాయమైపోయే ఏకైక నది

లూనీ నది.. ఎడారిలో మాయమైపోతుంది

వాగులన్నాక నదుల్లో కలవాలి. నదులన్నాక సముద్రంలో కలవాల్సిందే!. అది ప్రకృతి సహజం. కానీ, ఆ సహజ గుణానికి విరుద్ధంగా ప్రవహించే నది ఒకటి ఉందని తెలుసా?.  వందల కిలోమీటర్ల దూరం ప్రవహించే ఆ నది.. ఎందులోనూ కలవకుండా ఎడారి ఇసుక తిన్నెల్లో మాయమవుతుంది. ఎన్నో ఏండ్లు గడుస్తున్నా ఆ నది గుణం ఏంటో రీసెర్చ్​ చేసేవాళ్లకి అంతుచిక్కడం లేదు.  పైగా ఇది ఎక్కడో కాదు.. మన దేశంలోనే ఉంది!.  ఆ నది పేరే లూని.

నదులంటేనే దాదాపుగా మంచి నీటితో నిండి ఉంటాయి. వాగులు, వంకలు, ఉప నదుల్లోని నీరు నదుల్లోకి చేరి ..  ఆఖరిలో ఏ సముద్రంలోనో లేదంటే మహాసముద్రంలోనో  కలుస్తాయి. మన దేశంలో దాదాపుగా అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఒకటో రెండో నదులు మాత్రం పశ్చిమ దిశగా ప్రవహించి..అరేబియన్ సముద్రంలో కలుస్తాయి. కానీ, పశ్చిమ దిశగా ప్రవహిస్తూ.. ఏ సముద్రంలో కలవని నదిగా లూని నది ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. రాజస్థాన్​లో ఉన్న ఈ నది ఎక్కువ భాగం ఎడారి గుండా ప్రవహించడం ఒక విశేషమైతే..  అందులో ఎక్కువ భాగం ఉప్పు నీటితో ప్రవహించడం మరో స్పెషాలిటీ. 

కొంచెం నీరు.. కొంచెం ఉప్పు

అజ్మీర్​ జిల్లా ఆరావళి పర్వతశ్రేణుల్లోని 772 మీటర్ల ఎత్తులో ఉండే నాగా హిల్స్​ బండరాళ్ల నుంచి లూని నది ప్రయాణం మొదలవుతుంది. ఈ స్టార్టింగ్ పాయింట్​ వద్ద ఈ నదిని సగర్మతి(Sagarmati) అని పిలుస్తారు. అక్కడి నుంచి నైరుతి దిశగా గుజరాత్ వైపు నదీ​ ప్రవాహం ఉంటుంది. గోవింద్​ఘడ్​ దగ్గర సరస్వతి నది దీనిలో కలుస్తుంది. అక్కడి నుంచి దీనిని ‘లూని’ నది అని పిలుస్తారు. నాగౌర్​, పాలి, జోధ్​పూర్​, బార్మర్, జాలోర్​ జిల్లాల గుండా 495 కిలోమీటర్ల ప్రయాణం సాగుతుంది. అలా ఊర్లు అన్నీ దాటుకుంటూ థార్​ ఎడారిలోకి అడుగుపెడుతుంది లూని. ఆఖరికి రన్న్​​ ఆఫ్​ కచ్(గుజరాత్​)​ ఈశాన్య భాగంలోని ​బెరైన్​ దగ్గర ఇసుక దిబ్బల్లో సన్ననిధారగా మాయమైపోతుంది లూని. మొదటి వంద కిలోమీటర్ల వరకు ఈ నదిలో మంచి నీరు ఉంటుంది. బార్మర్​ జిల్లా బాలోత్రా దగ్గర ఉప్పునేలల కారణంగా నది నీరు మొత్తం  ఉప్పగా మారుతుంది. ఆ తర్వాత చాలాదూరం నదీ ఇదే టేస్ట్​తో ప్రవహిస్తుంది. సంస్కృతంలో ఉప్పుని లవణరవి, లవణవతి అంటారు. అందుకే ఈ నదిని ‘లూని’ అనే పేరుతో పిలుస్తున్నారు.  ఇంగ్లీష్​లో లూనిని ‘సెలైన్​ రివర్​’ అని పోష్‌గా పిలుస్తుంటారు.

ఊడిపడే వరదలు

తక్కువ వర్షపాతం, ఎక్కువ వేడి వల్ల ఈ నదిలో ఎప్పుడూ వాటర్ ఫ్లో తక్కువగానే ఉంటుంది. అదే టైంలో నీరు త్వరగా ఆవిరి అయిపోతుంటుంది కూడా. కొండలు, ఊళ్లు, పల్లపు ప్రాంతాలు దాటుకుంటూ ఎడారి గుండా నిదానంగా సాగుతుంది లూని. అయితే ఇసుక మెట్టెలు ఎక్కువ లోతుగా లేకపోవడంతో..  ఎంత నీరు చేరినా నది మరీ లోతుగా ఉండదు.  ఒకవేళ నీటి ఉధృతి ఎక్కువగా వచ్చినా.. వెడల్పుగా ప్రవహిస్తుంటుంది. ఆ టైంలో తీర ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.  లూని నది బేసిన్ మొత్తం 37 వేల చదరపు కిలోమీటర్లు పైనే ఉంటుంది. ఎప్పుడూ ఎండిపోయినట్లు ఉండే ఈ నది.. వానాకాలంలో మాత్రం చాలా డేంజర్​.  సడన్‌గా వచ్చే వరదలు తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. సాధారణంగా వానాకాలంలో  200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది. అలాంటిది 2006లో ఏకంగా 601 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యింది. దీంతో ఎండిపోయిన పాయలా ఉండే ఈ నది.. సముద్రంలా ఉగ్రరూపం దాల్చింది. ఆ దెబ్బకి బార్మర్ జిల్లాలో 25 అడుగుల లోతు నీరు చేరి.. వందల సంఖ్యలో పశువులు చనిపోయాయి. పదుల సంఖ్యలో మనుషులు కూడా బలయ్యారు. 2010లో, 2017లో మళ్లీ అది లెవల్​లో వరదలు వచ్చాయి. అయితే 2010లో పెద్దగా నష్టం వాటిల్లకపోగా,  2017లో మాత్రం చాలామంది చనిపోయారు. ఇలా ఫ్లాష్​ ఫ్లడ్స్​తోనూ ఈ నదిపేరు అప్పుడప్పుడూ వార్తల్లో వినిపిస్తుంటుంది.

ఉప నదుల స్పెషాలిటీ

లూని నదికి జవాయి, సుక్రి, గుహియా, బండి(హేమవాస్​), జోజారి ఉపనదులు. కానీ, ఇవి వాగుల ఆధారితం కావడంతో ప్రవాహం ఎక్కువగా ఉండదు. వానాకాలంలో మాత్రం కొండల నుంచి వచ్చే నీటి ఉధృతి ఎక్కువ ఉంటుంది. ఈ ఉపనదులన్నీ కుడి వైపు వచ్చి కలుస్తుంటే.. ఒక్క జొజారి ఉపనది మాత్రం ఎడమవైపు కలుస్తుంది. లూనికి ఉపనదుల్లో ఆరావళి పర్వతశ్రేణుల్లో పుట్టని ఏకైక ఉపనది జొజారినే.  పుష్కర్​ సరస్సు నుంచి పుట్టిన సరస్వతి నది నీళ్లు కూడా ఇందులో కలిసినప్పటికీ.. దానిని ఉపనదిగా మాత్రం పరిగణించరు. లూని ఒక డ్రై రివర్.  అయినప్పటికీ పశ్చిమ రాజస్థాన్​కి ఇదే ఇరిగేషన్​ సోర్స్​ అంటే ఆశ్చర్యపోవాల్సిందే. వానాకాలంలో వచ్చే వరదలో దంతివాడా, సిపు డ్యామ్​లు దాదాపుగా నిండుతాయి. వీటితో పాటు జోధ్​పూర్​ జిల్లా బిలారాలోని పిచియాక్ దగ్గర జస్వంత్ సాగర్​ అనే భారీ డ్యామ్​ కూడా ఉంది. 1892లో మహారాజా జస్వంత్ సింగ్​ దీనిని కట్టించాడు. అయితే దీనిచుట్టూ ఉన్న సరస్సు మాత్రం సహజంగా ఏర్పడింది. అంతేకాదు, మన దేశంలో పెద్ద సరస్సుల్లో ఇదొకటి. ఈ డ్యామ్​ల్లోని నీరు లక్షల ఎకరాల్లో సాగు భూములకు పనికొస్తుంది.  టూరిజం పరంగా ఈ నదికి పేరుంది. లూని అందాలు బాలోత్రా దగ్గర చూడముచ్చటగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఈ నది ఎంతో ప్రాచుర్యం పొందింది. మార్చి‌ నెలలో జరిగే థార్​ పండుగ టైంలో లక్షల మంది ఈ నది పాయల్లో పుణ్యస్నానాలు చేస్తారు.

కలర్​ఫుల్ వ్యూ

లూని నది రీసెర్చ్​కి.. ఇప్పుడు చెప్పుకోబోయే మరో వాటర్ మిస్టరీకి దగ్గరి సంబంధం ఉంది. ఈ రెండింటి రీసెర్చ్​ని ఇంటర్నేషనల్ వాటర్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​, ఓషనోగ్రఫీ ఆఫ్ యూకే సైంటిస్టుల టీమ్‌లే డీల్​ చేస్తున్నాయి.  ఇంతకీ ఈ రెండో వింత ఏంటంటే..  రెండు మహా సముద్రాలు కలిసే ‘ది గల్ఫ్ ఆఫ్​ అలస్కా’.  ‘‘రెండు సముద్రాలు కలిసే చోటు.. కానీ, అవి కలవవు!”.  కన్ఫ్యూజింగ్‌గా ఉంది కదా.  అదొక సామెత. ఈ సామెత పుట్టింది కూడా ది గల్ఫ్ ఆఫ్​ అలస్కా మిస్టరీ నుంచే. అలస్కా తీరం దగ్గర ఉంది ఈ పాయింట్. ఈ పాయింట్ దగ్గర అట్లాంటిక్​, పసిఫిక్ మహాసముద్రాలు కలుస్తాయి.  ఆ వ్యూ కలర్​ఫుల్‌గా ఉంటుంది.  ఒకవైపు ఫసిఫిక్​ మహాసముద్రంలోని నీరు లైట్ కలర్​ బ్లూ రంగులో, మంచి నీటి రుచితో ఉంటాయి. మరోవైపు అట్లాంటిక్​ సముద్రపు నీరు ఉప్పగా, డార్క్​ రంగులో ఉంటాయి. సాధారణంగా నదులు సముద్రంలో కలిసే చోట, ఇలా రెండు సముద్రాలు కలిసే చోట.. నీటి గాఢత, రుచి కలిసిపోతుంది. కానీ, ది గల్ఫ్​ ఆఫ్ అలస్కా వద్ద అలాంటిదేం జరగలేదు. ఒకవేళ టెంపరేచర్​, ఉప్పదనం వల్ల అలా జరిగిందని అనుకుంటే..  మిగతా సముద్రాల విషయంలో అలా ఎందుకు జరగలేదన్నది చాలామంది సైంటిస్టుల వాదన. అయితే జనాలు మాత్రం ఇదంతా సముద్రుడి మాయ అని నమ్ముతారు. ఈ మిస్టరీ ఏంటన్నది సైంటిఫిక్​గా ఇంతవరకు ఏం ప్రూవ్ కాలేదు.

ఆ ఒక్కటి తెల్వలే!

లూని నది పొల్యూషన్ కారణంతో కూడా తరచూ వార్తల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా పాలీ జిల్లాలో ఫ్యాక్టరీ చెత్త ఎక్కువగా కలుస్తుంటుంది. దీంతో రైతులు నిరసన పోరాటాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే కొన్ని ఊళ్లలో డ్రైనేజీ నీరు కూడా వచ్చి చేరుతుంది. ఈ నదీ తీర ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, ఈ కట్టడాల వల్ల ఫ్యూచర్​లో ప్రమాదాలు జరగొచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. జైసల్మేర్​ జిల్లా భనియానా దగ్గర, పలావో ఛానెల్ దగ్గర ఈ నదిపై రీసెర్చ్​ సెంటర్స్​ ఉన్నాయి. కొండల్లో పుట్టి.. విచిత్రంగా ఎడారిలో మాయం కావడం గురించి తెలుసుకునేందుకే ఈ రీసెర్చ్​ సెంటర్లు పని చేస్తున్నాయి. దాదాపు పాతికేళ్లు గడుస్తున్నా.. ఈ రీసెర్చ్​ల్లో ఎలాంటి ఫలితం కనిపించలేదు. అందుకే ఇంటర్నేషనల్ రీసెర్చ్​ హౌజ్​లు కూడా లూని నది మిస్టరీ సాల్వ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.  వేల కిలోమీటర్లు ఎడారి గుండా ప్రవహించే నైలు లాంటి పెద్ద నదికే ఎండ్ పాయింట్(మధ్యధరా సముద్రం) అంటూ ఒకటి ఉంది. అలాంటిది లూని నదికి అలాంటి పాయింట్ ఎందుకు లేదు!. ఈ విషయంపైనే సంవత్సరాల తరబడి రీసెర్చ్​ జరుగుతూనే వస్తోంది. కానీ, తీరం వెంబడి ఉండే ప్రజలు మాత్రం ఈశ్వరుడి శాపం వల్లే లూని నదికి ఇలా జరుగుతుందని కథలుగా చెప్పుకుంటుంటారు. ఏదేమైనా ప్రకృతితో ముడిపడిన ఈ మిస్టరీ వీడేందుకు ఎంత టైం పడుతుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు సైంటిస్టులు. -శుభాశ్రీ