- 4–6 నెలలకు పెరిగిన వెయిటింగ్ పీరియడ్
- డిమాండ్ మరింత పెరుగుతుందంటున్న బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి
న్యూఢిల్లీ: దేశంలో లగ్జరీ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. మెర్సిడెజ్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ కంపెనీల సేల్స్ పెరగడమే దీనికి నిదర్శనం. సప్లయ్ చెయిన్‌లో సమస్యలు నెలకొనడంతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కార్లను డెలివరీ చేయడంలో ఆలస్యమవుతోందని ఈ కంపెనీలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్‌లోని కార్లకు డిమాండ్ పెరిగిందని లగ్జరీ కార్ల కంపెనీల టాప్ అధికారులు చెబుతున్నారు. ‘కిందటేడాదే ట్రెండ్ స్టార్టయ్యిందని చెప్పాలి. రూ. 70–75 లక్షల కంటే ఎక్కువ రేటు ఉన్న సీ, డీ సెగ్మెంట్‌లలో డిమాండ్ పెరిగింది. వాల్యూమ్ సెగ్మెంట్ (కార్ల రేటు రూ. 70 లక్షల లోపు ఉన్న సెగ్మెంట్ ) తో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్‌లో గ్రోత్ రేటు ఎక్కువుగా ఉంది’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. ఇటువంటి కార్లను కొనే వారు (ఇండస్ట్రియలిస్టులు, బాలివుడ్ సెలబ్రిటీలు, స్పోర్ట్స్ సెగ్మెంట్‌లోని వ్యక్తులు) ముందుకొస్తున్నారని, లగ్జరీ గూడ్స్‌ను కొనడంలో వెనకడుగు వేయడం లేదని చెప్పారు. దీంతో డిమాండ్ చాలా బాగుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓ ఉదాహరణను కూడా బల్బీర్ ఇచ్చారు. ఆడి ఎలక్ట్రిక్ కారు ఈ–ట్రాన్‌ను రూ. కోటి కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నామని, ఈ కారు ఇండియాకు రాకముందే అమ్ముడవుతోందని అన్నారు. ఈ కార్లను ఇండియాకు తీసుకురాలేకపోవడంలో సప్లయ్ సమస్యలు నెలకొనడం కొంత కారణంగా ఉందన్నారు. ఏదైనా సరే ఈ–ట్రాన్ లేదా క్యూ8(ఎస్‌యూవీ) వంటి మోడల్స్ లోకల్‌గా అందుబాటులోకి వచ్చే ముందే అమ్ముడవుతున్నాయని చెప్పారు. డిమాండ్ పెరగడం, సప్లయ్ చెయిన్‌లో సమస్యల వలన ఈ కార్ల వెయిటింగ్ పీరియడ్ ఒకటి రెండు నెలల నుంచి నాలుగైదు నెలలకు పెరిగిందని బల్బీర్ అన్నారు.
బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కార్లకు గిరాకీ..
ప్రీమియం కార్లకు డిమాండ్ పెరిగిందని మరో లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ ప్రకటించింది. స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్స్ (ఎస్‌ఏవీ) కార్లు అయిన ఎక్స్3, ఎక్స్4, ఎక్స్7 మోడల్స్‌కు మంచి డిమాండ్ ఉందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావహ్ అన్నారు. ఎస్‌ఏవీ సెగ్మెంట్‌లో 40 శాతం గ్రోత్‌ను నమోదు చేస్తామని పేర్కొన్నారు. తమ కార్ల పోర్టుఫోలియోలో ఈ సెగ్మెంట్ వాటా 50 శాతంగా ఉందని చెప్పారు. బీఎండబ్ల్యూ ఎస్‌ఏవీ కార్ల రేట్లు రూ. 61 లక్షల నుంచి స్టార్టవుతున్నాయి. ఈ ఏడాది జనవరి–మార్చి పీరియడ్‌లో 1,345 స్పోర్ట్స్ యాక్టివిటీ కార్లను సేల్ చేశామని కంపెనీ ప్రకటించింది. కిందటేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువని పేర్కొంది. బీఎండబ్ల్యూకి చెందిన ‘మినీ’ కార్లతో కలిపి ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో 2,500 యూనిట్ల కోసం బుకింగ్స్ సాధించామని కంపెనీ ప్రకటించింది. వెయిటింగ్ పీరియడ్ 3 నెలలుగా ఉందని పేర్కొంది. కాగా, ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో బీఎండబ్ల్యూ గ్రూప్ సేల్స్ 25.3 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగి 2,815 యూనిట్లకు పెరిగాయి. కంపెనీకి ఇండియాలో ఇదే బెస్ట్ క్వార్టర్ కావడం గమనించాలి. భవిష్యత్‌లో కూడా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. సెమికండక్టర్ల కొరత, షిప్పింగ్‌లో సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో సప్లయ్ చెయిన్‌లో సమస్యలు తలెత్తాయని పేర్కొన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ సమస్యలు సద్దుమణిగి, సప్లయ్ సమస్యలు తగ్గుతాయని అంచనావేస్తున్నాయి.
బెంజ్ కార్లు అదే బాటలో..
తమ కార్లకు గ్లోబల్‌గా డిమాండ్ పెరిగిందని మెర్సిడెస్–బెంజ్ పేర్కొంది. ‘దురదృష్టవశాత్తు కొన్ని కార్లను పొందడానికి కస్టమర్లకు నెలలు కొద్ది టైమ్ పడుతోంది. జీఎల్‌ఎస్, జీఎల్‌ఈ (ఎస్‌యూవీ) మోడల్స్‌ను తీసుకురావడంలో ఎటువంటి సప్లయ్ సమస్యలు లేవు. కానీ, గ్లోబల్‌గా డిమాండ్ ఎక్కువవ్వడంతో వీటిని డెలివరీ చేయడంలో టైమ్ పడుతోంది’ అని మెర్సిడెస్–బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ స్వెంక్ అన్నారు. ఈ ఏడాది జనవరి–మార్చిలో వివిధ మోడల్స్ కోసం 4,000 యూనిట్లకు ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. రూ. కోటి కంటే ఎక్కువ రేటు ఉన్న 2,000 యూనిట్లను కిందటేడాది బెంజ్ అమ్మింది. ఇందులో ఎస్–క్లాస్ మేబ్యాచ్, జీఎల్‌ఎస్ మే బ్యాచ్ మోడల్స్‌తో పాటు ఏఎంజీ, ఎస్–క్లాస్, జీఎల్‌ఎస్ (ఎస్‌యూవీ) వంటి మోడల్స్‌లలో ప్రీమియం కార్లు ఉన్నాయి. కిందటేడాది కంపెనీ సేల్ చేసిన మొత్తం కార్లలో హై ఎండ్ కార్ల వాటా 30 శాతంగా ఉంది.