
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో భూభారతి రెవెన్యూ చట్టంపై అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17 నుంచి 30 వరకు ప్రతి మండలంలో భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ చట్టంపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు.
ప్రతిరోజు 30 నిమిషాలు భూభారతి పోర్టల్ లో పొందుపర్చిన విషయాలను పరిశీలించాలని సూచించారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి చట్టం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలిపారు. నూతన చట్టం ప్రకారం మాత్రమే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, సాదా బైనామాలు చేయాలని వెల్లడించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు, సూర్యాపేట ఆర్టీవో వేణుమాధవరావు, కోదాడ సూర్యనారాయణ, హుజూర్నగర్ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.