అశ్విన్ నా అత్యుత్తమ కోచ్.. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం

అశ్విన్ నా అత్యుత్తమ కోచ్.. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం

సాధారణంగా దిగ్గజాలను యంగ్ క్రికెటర్లు ఆదర్శంగా భావిస్తారు. లేకపోతే క్రికెట్ లో సీనియర్లను చూసి స్ఫూర్తి పొందుతారు. కానీ ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ నాథన్ లియోన్ మాత్రం తన కన్నా తక్కువ వికెట్లు తీసిన అశ్విన్ తన జీవితంపై చాలా ప్రభావం చూపించాడని తెలిపాడు. ఇద్దరూ క్రికెట్ లో సమకాలీన ఆటగాళ్ళే. టెస్టు క్రికెట్ లో పోటీ పడి మరీ వికెట్లు తీస్తారు. ఇలాంటి ఆటగాళ్ల మధ్య ఈగో ఉండడం చూసాం గాని ఇలా ప్రశంసలు కురిపించడం క్రికెట్ లవర్స్ కు కొత్తగా అనిపిస్తుంది. 
     
లెజెండరీ ఆస్ట్రేలియన్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ తన కెరీర్‌పై అశ్విన్ ఎంత ప్రభావం చూపించాడో చెప్పుకొచ్చాడు." అశ్విన్ నా పెద్ద కోచ్ లలో ఒకడు. అశ్విన్ బౌలింగ్ యాక్షన్ చూడడం ద్వారా చాలా నేర్చుకున్నాను. అతని కెరీర్ ప్రారంభం నుంచి గమనిస్తున్నాను. ఆసీస్ ను చాలా సార్లు ఇబ్బందిపెట్టాడు. అతడంటే ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మనం ప్రత్యర్థులపై ఆడేటప్పుడు అవతలి వ్యక్తుల నుంచి చాలా నేర్చుకోవచ్చు. నేను ఖచ్చితంగా అతని నుండి చాలా నేర్చుకున్నాను.మేమిద్దరం త్వరలో 500 వికెట్ల మార్క్‌ చేరుకోనుండడటం చాలా అద్భుతంగా అనిపిస్తుంది". అని లియాన్.. అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. 

లియోన్ టెస్టుల్లో ప్రస్తుతం 496 వికెట్లు తీసాడు. మరో 4 వికెట్లు తీస్తే టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్ లో చేరిన నాలుగో స్పిన్నర్ గా చరిత్ర సృష్టిస్తాడు. పాకిస్థాన్ మూడు టెస్టుల సిరీస్ రేపు (డిసెంబర్ 14) నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు అశ్విన్ టెస్టుల్లో 489 వికెట్లు తీసి 500 క్లబ్ కు మరో 11 వికెట్లు దూరంలో ఉన్నాడు. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా.. జనవరి 25 నుంచి ఇంగ్లాండ్ తో భారత్ 5 టెస్టులు ఆడాల్సి ఉంది.