టాలీవుడ్ ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి(48) కన్నుమూశారు. కొన్ని రోజుల పాటు క్యాన్సర్ తో బాధపడ్డారు. అయితే ట్రీట్మెంట్ తో క్యాన్సర్ నుంచి బయటపడినా.. ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. కొన్ని రోజులుగా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా ఎక్కువ రోజుల పాటు ఆయన కీమో థెరపీ చేయించుకున్నారు. అయితే ఇది ఆయనకు మరింత ప్రమాదంగా మారింది. కీమో కారణంగా స్పైనల్ కార్డ్ దెబ్బతింది. దీంతో ఆయన నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. సర్జరీ చేసినా ఆరోగ్యం మెరుగవ్వలేదు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది సేపటిక్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. కంది కొండ తెలంగాణ పల్లెపదాలను,పల్లె వాతావారణాన్ని తన అక్షరాలతో వివరించాడు. V6 లో బతుకమ్మ పాటలు రాశారు.
కంది కొండ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మన యాస, భాషా పాటలే. అచ్చమైన పల్లె పదాలతో ఆయన పదాల అల్లిక ప్రతీ ఒక్కిరి మనసులను హత్తుకుంటుంది. పండుగ సంబరానికి తన అక్షరాలతో ఓ రూపునిచ్చి.. జనం నాలుకలపై పదనిసనలు చేసేవారు. తెలంగాణ పల్లె పదాలే కాదు.. సినిమాల్లో ఆయన రాసిన పాటలు.. చాలా పాపులర్ అయ్యాయి. దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ ఆధ్వర్యంలో వచ్చిన అనేక సినిమాల్లో మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు. సందీప్ చౌతా, మణిశర్మ, యువన్ శంకర్ రాజా, రమణగోగుల, హరీశ్ జయరాజ్, అనూప్ రూబెన్స్, ఏఆర్ రెహమాన్, సురేష్ బొబ్బిలి.. సంగీత దర్శకత్వంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు అందించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్ డీ చేసిన కందికొండ తెలంగాణ ఉద్యమ పాటలు కూడా రాశారు. తెలంగాణ రాష్ట్రం కోసం గొంతెత్తిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. తెలంగాణ ఫార్మేషన్ డే పాట రాశారు. ఇవి గాక ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్ కు పాటలు అందించారు. ప్రతి సంవత్సరం బోనాలు, బతుకమ్మ పాటలు రాస్తూ తెలంగాణ బతుకులను ఆవిష్కరించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కోసం సినిమా పాటలపై పుస్తకాన్ని రాశారు. భూ లచ్చుమువ్వ, జెన్నకీడిశిన గిత్త గుండెల ప్రేమ జనించింది... లాంటి కథలు అందించారు. “ఓయూ.. మా అవ్వ’ పేరిట కవితా సంపుటి కూడా తీసుకు రావాలనుకున్నారు. కానీ అనారోగ్యంతో కొంత బ్రేక్పడింది.
పూలే, అంబేద్కర్ ఆలోచనా ధారను, దళిత బహుజన ఐక్యతను పెంపొందించే పాటలను, ముస్లింల దయనీయ స్థితిగతుల గురించి ఆయన పాటలు రాశారు. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చిత్రీకరించిన ‘పూలే వారసులం’ పాట ఇప్పటికీ చాలా ఫేమస్. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉద్యమాలకు చేయూతనిచ్చేలా ఎన్నో పాటలు రాశారు. ఉద్యమకారులకు, హక్కుల కార్యకర్తలకు, విద్యార్థులకు తన పాటతో స్ఫూర్తిగా నిలిచారు కందికొండ. బహుజనోద్యమాలకు ఊపిరిలూది ఓ తరానికి స్ఫూర్తిగా నిలిచారు.
కందికొండ రాసిన పాటలు
- ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
- 143
- ఆంధ్రావాలా (2004): గిచ్చి గిచ్చి, మల్లెతీగరోయ్, కొక్కొ కోలమిస్స
- అల్లరి పిడుగు
- ఆప్తుడు
- ఒక రాధ ఇద్దరి కృష్ణుల పెళ్ళి
- చక్రం
- ఎంజాయ్
- ఆడుతూ పాడుతూ
- షాక్
- రణం
- పోకిరి
- సీతారాముడు
- స్టాలిన్
- తొలి చూపులోనే
- పొగరు
- చిన్నోడు
- రిలాక్స్
- భాగ్యలక్ష్మి బంపర్ డ్రా
- ఆదిలక్ష్మి
- నువ్వంటే నాకిష్టం
- జూనియర్స్
- ధన 51
- దొంగ దొంగది
- అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి
- మున్నా
- లవ్ యు బంగారమ్ (2014): రెండు కళ్ళు సాలవట
- మా అబ్బాయి (2017): కదిలే కదిలే, ఆ చందమామ