తెలంగాణ ఉద్యమంలో పాలమూరు వలస కూలీల దుర్భర జీవితాల దు:ఖ గానం లేకుండా రాష్ట్రంలో ఎక్కడా సభలు జరిగేవి కావు. ముంబాయి, దుబాయి, బొగ్గుబాయిగా తెలంగాణ బతుకంతా బుగ్గి బుగ్గి అయిపోయిందని కేసీఆర్తన కండ్లపొంటి నీళ్లు ఆగటం లేదని మాట్లాడేవారు. తెలంగాణలో సబ్బండ వర్గాలతోపాటు, వలసలు తప్ప నిలిచి బతకలేని పాలమూరు ప్రజల బతుకులు బాగుపడతాయని అంతా నమ్మారు. కానీ స్వరాష్ట్రంలో వలసలను ఆపడానికి ఫలానా చర్య తీసుకున్నామని చెప్పే ఏ ఒక్క టీ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టలేదు. పైగా పాలమూరుకు తిరుగు వలసలు మొదలయ్యాయని ప్రచారం లంకించుకున్నారు. ఇక్కడి బీడు భూములు సస్యశ్యామలంగా మారాయని, బయటి జిల్లాల నుంచి బతుకుదెరువుకు పాలమూరుకే ఇతరులు వస్తున్నారని ఊదరగొట్టారు. ఇది నిజమేనా? పాలమూరు వలస బతుకులు తిరిగి నిలకడ జీవితంలోకి వచ్చినట్టేనా? కొంత లోతుగానే పరిశీలించాలి. పాలమూరు వలసలపై సి. రామ్మోహన్లోతైన పరిశీలన చేశారు. 1883 నుంచి1948 దాకా తొలిదశగా హైదరాబాద్ రాజ్యంలో జరిగిన అనేక నిర్మాణాలకు పూనుకున్న రాజ్య అధికార యంత్రాంగం ప్రజలను వలస తీసుకొచ్చినట్లు చర్చించారు. హైదరాబాదు చుట్టూ రిజర్వాయర్లు, మూసీ నది వరదల నుంచి రక్షణ నిర్మాణాలు, వంతెనలు, కంటోన్మెంటు ప్రాంత నిర్మాణాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, రైలుమార్గాలు, రాజ్యంలో వివిధ జిల్లాలలో సాగునీటి కోసం చేపట్టి డిండి, నిజాంసాగర్, కోయిల్ సాగర్ వంటి రిజర్వాయర్ల నిర్మాణం, హైదరాబాద్ నగరంలోని రోడ్ల నిర్మాణంలోనూ పాలమూరు కూలీలు రెక్కలు ముక్కలు చేసుకున్న తీరు వివరించారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో..
1948 నుంచి 1980ల దాకా పెరుగుతూ వచ్చిన ఈ వలసలను రెండో దశగా దేశమంతటా జరిగిన నిర్మాణాల కోసం ఒక దళారీ వ్యవస్థ చాలా పకడ్బందీగా తరలించినట్లు ఆయన వివరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద సంఖ్యలో గ్రూపు మేస్త్రీలు, గుంపు మేస్త్రీలతో భారీ మధ్య తరహా నిర్మాణ కంపెనీల కాంట్రాక్టర్లు లెంకకు ఇంతా అని డబ్బు ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. అలా కాంట్రాక్టు కంపెనీలు కూలీల రెక్కల మీద కోట్లు ఆర్జించగా, వలస కూలీల బతుకులు మాత్రం పనిలోనే తెల్లారాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన, భారీ నిర్మాణాలు, ప్రాజెక్టులు, కాలువలు, విద్యుత్తు స్తంభాలు నాటడంలో పాలమూరు కార్మికుల జీవన విధ్వంసం జరిగింది. 1980 తరువాత పాలమూరు బిడ్డల వలస జీవితం మరీ దుర్భరమైంది. కాంట్రాక్టర్లు, బడా కంపెనీల పెద్దలు వేలలో గుంపు మేస్త్రీలు, వందల్లో గ్రూపు మేస్త్రీలు గుంపులో 30 నుంచి 50 చొప్పున లక్షలాదిగా మహబూబ్ నగర్ శ్రామికులను దేశం నలుమూలలకు తరలించారు. శ్రీశైలం ముంపు, వ్యవసాయంలో సంక్షోభం, భూగర్భజలం ఇంకిపోయిన దుస్థితి, విపరీతమైన అప్పులు, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు ఈ దుస్థితికి ఆయా కుటుంబాలు సమాజాన్ని మాత్రమే కాదు మొద్దు బారిన రాజకీయ పార్టీలు సైతం స్పందించక తప్పని పరిస్థితులు తెచ్చాయి. వలసపోయేవారిని తరలించే బస్సులు, వలస చావుల శరీరాలను దింపే వాహనాలు పల్లెలను శోకంలో నింపేది. ఏ ప్రభుత్వం కూడా వలస కూలీల కష్టాలను పట్టించుకోలేదు. లెక్కలు తీయలేదు. ఈ వలసలకు నిష్కృతి ఎట్లా అనే ప్రశ్న నుంచే జిల్లాలో జలసాధన పోరాటాలు పుట్టాయి. వలస మృతుల శరీరాలను ఊరేగించి కార్యాలయాల ముందు పడుకోబెట్టి ఇదేమి దౌర్భాగ్యమని ప్రశ్నించటంతో జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వంటి లిఫ్టు పథకాలు చేపట్టక తప్పలేదు.
స్వరాష్ట్రంలోనూ..
1983 నుంచి 2012 నాటికి కనీసం నాలుగు, అయిదు తరాల ప్రజల నవయవ్వన జీవితం వలసలో మగ్గిపోయింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. స్వరాష్ట్రంలోనైనా వలస కూలీల బతుకులు బాగుపడతాయని అనుకుంటే.. జిల్లాలో కొత్తగా ఒక్క సాగునీటి పథకం కూడా ప్రభుత్వం చేపట్టలేదు. అయితే పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు వృద్ధులకు, చిన్న పిల్లలకు సహాయకారిగా అందటంతో యువత స్వతంత్ర వలసకు పూనుకునే అవకాశాలు పెరిగాయి. ఇంత జరిగినా ఇప్పటికీ గ్రూపు మేస్త్రీలు, గుంపు మేస్త్రీలు లేబర్ను తరలిస్తూనే ఉన్నారు. ఇలా తరలిపోతున్న యువత సమీప పెద్ద గ్రామాలకు, మండలాలు పట్టణాలకు మాత్రమే కాక హైదరాబాదు, ముంబాయి, పూణె, బెంగళూరు నగరాలకు పనివాళ్లుగా అందివచ్చారు. భవన నిర్మాణం, ఆటోమొబైల్, టెలికాం వంటి రంగాలలోనే గాక నగరాల్లో అన్ని వ్యాపార, వైద్య, విద్యా సంస్థలకు, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు, చవక పనివాళ్లుగా కొత్త కట్లలో బిగించబడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్పొరేట్ల వైపునించి కాకుండా శ్రామికుల వైపు నించి ఆలోచించి వారి బతుకులకు భరోసా ఇస్తాయని ఆశిద్దాం. - ఎం. రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక