హరిత విప్లవ మార్గదర్శి ఎంఎస్‌‌ స్వామినాథన్‌‌ ..

హరిత విప్లవ మార్గదర్శి ఎంఎస్‌‌ స్వామినాథన్‌‌ ..

కొన్ని రోజుల కిందట ప్రొఫెసర్‌‌ ఎంఎస్‌‌ స్వామినాథన్‌‌ మనందరికీ దూరమయ్యారు. వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మక మలుపు తిప్పిన ఓ దార్శనికుడిని మన దేశం కోల్పోయింది. భారతదేశానికి ఆ దిగ్గజం చేసిన సేవలు చరిత్రలో సువర్ణాక్షర లిఖితం. మాతృభూమిని అమితంగా ప్రేమించే ప్రొఫెసర్‌‌ స్వామినాథన్‌‌- మన దేశం సదా సుభిక్షంగా ఉండాలని కోరుకునేవారు. ముఖ్యంగా మన రైతులోకం సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఒక తెలివైన విద్యార్థిగా తన ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసుకునే వీలున్నా 1943 నాటి బెంగాల్‌‌ కరువు ఆయనను చలింపజేసింది. ఆ రోజుల్లో స్వామినాథన్​ ఎంతగా ప్రభావితులయ్యారంటే ఆరు నూరైనా వ్యవసాయ రంగమే తన భవిష్యత్తుగా ఆయన తిరుగులేని నిర్ణయం తీసుకున్నారు.  అటుపైన వ్యవసాయ శాస్త్రంలో చదువు ముగించిన స్వామినాథన్‌‌కు తొలినాళ్లలోనే ప్రపంచ ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌‌ నార్మన్‌‌ బోర్లాగ్‌‌తో పరిచయం ఏర్పడింది.


బోర్లాగ్​ అడుగుజాడల్లోనే నడుస్తూ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 1950లోనే అమెరికాలో అధ్యాపకుడుగా ఆయనకు అవకాశం వచ్చింది. కానీ, మాతృభూమి సంక్షేమం కోసం తన జన్మభూమి సేవలో తరించడమే తన        ధ్యేయమంటూ దాన్ని స్వామినాథన్​ తిరస్కరించారు.

ఉజ్వల వ్యవసాయ శకానికి నాంది 

పెను సవాళ్లతో నిండిన అప్పటి పరిస్థితుల్లో మేరుపర్వతంలా నిలిచిన స్వామినాథన్‌‌.. మన దేశాన్ని ఆత్మవిశ్వాసంతో స్వావలంబన వైపు నడిపించడాన్ని ఒకసారి ఊహించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి రెండు దశాబ్దాల్లో మనకు ఎదురైన పెను సవాళ్లలో ఆహార కొరత ప్రధానమైనది. ఆ మేరకు 1960వ దశకం తొలినాళ్లలో భారతదేశం కరువు కాటకాలు కమ్ముకుని అల్లాడుతోంది. అటువంటి గడ్డు పరిస్థితుల నడుమ ప్రొఫెసర్‌‌ స్వామినాథన్ మొక్కవోని పట్టుదల, నిబద్ధత, ముందుచూపుతో ఉజ్వల వ్యవసాయ శకానికి నాంది పలికారు. తదనుగుణంగా వ్యవసాయం రంగంలో.. ముఖ్యంగా గోధుమ సాగువంటి నిర్దిష్ట ఆహార పంటల సమృద్ధి దిశగా మార్గదర్శకుడై నిలిచారు. దీంతో  తొలుత గోధుమ ఉత్పత్తిలో మన దేశం గణనీయమైన వృద్ధి సాధించగలిగింది. ఫలితంగా ఆహార కొరతతో అల్లాడిన భారత్‌‌ అప్పటినుంచీ స్వయం సమృద్ది దేశంగా రూపొందింది. వ్యవసాయ రంగంలో దేశం సాధించిన ఈ అద్భుత విజయమే ఆయనకు “భారత హరిత విప్లవ పితామహుడు” అనే బిరుదును ఆర్జించిపెట్టింది.

ప్రణాళిక రూపకర్త దృఢ మనస్కుడైతే..

ప్రొఫెసర్‌‌ స్వామినాథన్‌‌ పరిశోధనలు కేవలం ఆయన విద్యా నైపుణ్యానికే పరిమితం కాదు. వాటి ప్రభావం ప్రయోగశాలల వెలుపలకు... వ్యవసాయ క్షేత్రాలు, -పొలాలకు విస్తరించింది. ఆయన పనితీరు శాస్త్రీయ జ్ఞానం- ఆచరణాత్మక అనువర్తనాల మధ్య అంతరాన్ని తగ్గించింది. వ్యవసాయ రంగంలో సుస్థిరత కోసం ఆయన సదా పాటుపడ్డారు. మానవ పురోగమనం, పర్యావరణ సుస్థిరత నడుమ సున్నిత సమతౌల్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. సన్న,- చిన్నకారు రైతుల జీవితాలను మెరుగుపరచడం, ఆవిష్కరణల ఫలాలు వారికీ అందించడంలో ప్రొఫెసర్‌‌ స్వామినాథన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడాన్ని నేను తప్పక ప్రస్తావించాలి.

ముఖ్యంగా మహిళా రైతుల జీవితాలకు సాధికారతపై ఆయన ఎంతో శ్రద్ధాసక్తులు చూపారు.  ప్రొఫెసర్ స్వామినాథన్‌‌లోని మరో విశిష్ట కోణం గురించి చెప్పాలి. ఆవిష్కరణల విషయంలోనే కాకుండా మార్గదర్శకత్వం వహించడంలోనూ ఆయనొక ఆదర్శమూర్తి. ఈ మేరకు 1987లో ప్రతిష్టాత్మక ‘అంతర్జాతీయ ఆహార పురస్కార’ తొలి విజేతగా బహుమతి అందుకున్న ఆయన, దానికి లభించిన సొమ్ముతో లాభాపేక్ష రహిత పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఇప్పటిదాకా వివిధ రంగాలలో విస్తృత, విశిష్ట పరిశోధనలు నిర్వహించింది. అలాగే ఆయన ఎందరో పరిశోధకులను తీర్చిదిద్దారు. అభ్యాసం, ఆవిష్కరణలపై ఎందరిలోనో శ్రద్ధాసక్తులు రగిలించారు. వేగంగా మారిపోతున్న నేటి ప్రపంచ పరిస్థితుల నడుమ విజ్ఞానం, మార్గదర్శకత్వం, ఆవిష్కరణలకుగల శక్తి సామర్థ్యాలను ఆయన జీవితం ప్రతిబింబిస్తుంది. ఆయన స్వయంగా ఓ సంస్థ స్థాపకులేగాక శక్తిమంతమైన పరిశోధనలు సాగిస్తున్న మరెన్నో సంస్థల స్థాపనకు ఊపిరి పోసినవారు. మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం డైరెక్టర్‌‌గానూ ఆయన పనిచేయడం ఇందుకు నిదర్శనం. కాగా, ఈ సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధన కేంద్రం 2018లో వారణాసి నగరంలో ప్రారంభమైంది.డాక్టర్‌‌ స్వామినాథన్‌‌కు నివాళి అర్పిస్తున్న ఈ సందర్భంలో నేనే మరో ద్విపదను ప్రస్తావించదలిచాను. “ప్రణాళిక రూపకర్త దృఢ మనస్కుడైతే.. తానేది.. ఏ రీతిలో  ఆకాంక్షించాడో ఆ రీతిలో.. దాన్ని సాధించగలడు” అని ఈ ద్విపద చెబుతుంది. 


వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని, రైతులకు సేవలందించాలని చిరుప్రాయంలోనే నిర్ణయించుకున్న మహనీయుడాయన. ఆ విధంగానే వినూత్నంగా.. ఆవిష్కరణాత్మకంగా, భావోద్వేగంతో తాను నిర్దేశించుకున్న లక్ష్యం సాధించారు. వ్యవసాయ ఆవిష్కరణలు, సుస్థిరత దిశగా మన పయనంలో డాక్టర్ స్వామినాథన్ కృషి, పరిశ్రమ మనకు సదా స్ఫూర్తిదాయక మార్గనిర్దేశం చేస్తాయి. మనం కూడా ఆయనెంతో ప్రీతిగా అనుసరించిన  సూత్రాల అమలుకు మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ముందుకు సాగాలి. ఆ మేరకు రైతుల సంక్షేమం ప్రాతిపదికగా శాస్త్రీయ ఆవిష్కరణల ఫలాలు మన వ్యవసాయ రంగంలో మూలాలకు చేరేలా చూడాలి. తద్వారా భవిష్యత్తరాలను వృద్ధి, సుస్థిరత, సౌభాగ్యంవైపు ప్రోత్సహించాలి.

ప్రతి ఒక్కరికీ అన్నదాత రైతే

ప్రొఫెసర్‌‌ స్వామినాథన్‌‌తో నా వ్యక్తిగత సంబంధాలు చాలా విస్తృతంగా ఉండేవి. నేను 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ రోజుల్లో గుజరాత్ వ్యవసాయపరంగా పెద్దగా నైపుణ్యంగల రాష్ట్రం కాదు. దీనికితోడు వరుస కరువులు, పెను తుపానులు, భూకంపం వంటి ప్రకృతి విపత్తులు రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో మేం ప్రారంభించిన అనేక కార్యక్రమాలలో భూసార కార్డుల పథకం ఒకటి. ఇది భూసారాన్ని చక్కగా అర్థం చేసుకోవడంలో తోడ్పడింది. సమస్యలు తలెత్తినపుడు వాటిని సులువుగా పరిష్కరించడం సాధ్యమైంది. ఈ పథకం అమలు సమయంలోనే నేను ప్రొఫెసర్‌‌ స్వామినాథన్‌‌ని కలిశాను. ఆయన ఈ పథకాన్ని ఎంతగానో  మెచ్చుకున్నారు. దాన్ని మరింత మెరుగుపరచడం కోసం విలువైన సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. చివరకు ఏదైనా పథకంపై సందేహాలు వెలిబుచ్చేవారు స్వామినాథన్‌‌ మాటతో ఒక్కసారిగా ఏకాభిప్రాయానికి వచ్చేవారు.

  నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మాత్రమేగాక ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక కూడా మా మధ్య నిరంతర సంబంధాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో 2016 నాటి  అంతర్జాతీయ వ్యవసాయ- జీవవైవిధ్య మహాసభలలో ఆయనను కలిశాను. మరుసటేడాది-  2017లో ఆయన రెండు భాగాలుగా రాసిన పుస్తకాన్ని నేనే ఆవిష్కరించాను.  ప్రపంచాన్ని పరస్పరం అనుసంధానించే సూదితో ‘తిరుక్కురళ్‌‌’లోని ఒక ద్విపద రైతుల గురించి అభివర్ణిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అన్నదాత రైతే! ఈ సూక్తిని ప్రొఫెసర్‌‌ స్వామినాథన్ చక్కగా జీర్ణించుకున్నారు. కాబట్టే, ప్రజలు ఆయనను “వ్యవసాయ శాస్త్రవేత్త”గా పిలుస్తారు. కానీ, ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు అంతకుమించినవని నా విశ్వాసం. ఆయన నిజమైన “రైతు.. శాస్త్రవేత్త కూడా! ఆయన ‘రైతుల శాస్త్రవేత్త’ ఆయన మెదడులో శాస్త్రవేత్త ఉంటే..  హృదయంలో రైతు ఉన్నాడన్నది నా అభిప్రాయం.

చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం

‘ఏదైనా సాధించగలం’ అనే భారతదేశ ఆత్మస్థైర్యానికి హరిత విప్లవం ఒక సమగ్ర ఉదాహరణగా నిలిచింది. ఆ మేరకు మనకు లక్ష సవాళ్లున్నా, ఆవిష్కరణలు ఆలంబనగా వాటిని అధిగమించగల పది లక్షల మేధావుల అండ ఉన్నదని రుజువైంది. హరిత విప్లవం శ్రీకారం చుట్టుకున్న ఐదు దశాబ్దాల తర్వాత.. నేడు భారత వ్యవసాయ రంగం అత్యాధునిక, ప్రగతిశీలమైనదిగా మారిందంటే కారణం ప్రొఫెసర్‌‌ స్వామినాథన్ వేసిన పునాదులేననే వాస్తవాన్ని ఎన్నటికీ మరువలేం. దేశ ఆహార కొరతను అధిగమించడంలో విజయం తర్వాత ఏండ్ల తరబడి ఆలుగడ్డ పంటను దెబ్బతీస్తున్న పరాన్న జీవుల ప్రభావాన్ని అరికట్టే దిశగా ఆయన పరిశోధన చేపట్టి సఫలమయ్యారు. అంతేకాకుండా ఈ పంట చలి వాతావరణాన్ని తట్టుకోగలిగే మార్గం కూడా లభించింది. ఇక ప్రపంచం నేడు చిరుధాన్యాలు లేదా ‘శ్రీఅన్న’ను  అద్భుత ఆహార ధాన్యాలుగా పరిగణిస్తోంది. అయితే, ప్రొఫెసర్ స్వామినాథన్ 1990లలోనే చిరుధాన్యాలపై చర్చను ముమ్మరం చేయడమేగాక సాగును ఇతోధికంగా ప్రోత్సహించారు.

- నరేంద్ర మోదీ
భారత ప్రధానమంత్రి