నేరాలు, ర్యాగింగ్​ పై ప్రత్యేక దృష్టి : ఎం.శ్రీనివాసులు

గోదావరిఖని, వెలుగు : నేరాల నియంత్రణతో పాటు ర్యాగింగ్​పై ప్రత్యేక దృష్టి సారిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాసులు అన్నారు. బుధవారం పోలీస్ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీపీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు.

రామగుండం మెడికల్ కాలేజీలో ఇటీవల జరిగిన ర్యాగింగ్ పై ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే డీసీపీలు, ఏసీపీలతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. కమిషనరేట్ పరిస్థితులు, నేరాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి రెడ్డి, నర్సింహులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.