ప్రమాదంలో బాల భారతం

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. అలాంటి బాలలు స్వేచ్ఛగా ఎదిగి, సమర్థవంతమైన మానవ వనరులుగా రూపుదిద్దుకునేలా చేయడం ప్రభుత్వ, పౌర సమాజం విధి, బాధ్యత కూడా. బాలల అభివృద్ధి, వికాసంపై కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బ చిన్నదేం కాదు. వారి విద్య, ఎదుగుదల, సామాజిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది. దాని ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు అంతంత మాత్రమే!. బాలకార్మిక వ్యవస్థ రూపంలో బాలలు దోపిడీకి గురవుతున్నారు. పసివారి నుంచి యుక్త వయసు ఉన్న బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. బాల్య వివాహాల బారిన పడుతున్న బాలికలు, పొట్ట కూటి కోసం నగరాలకు వెళ్లి, అక్కడ మౌలిక వసతులు లేక బస్తీల్లో వీధి బాలలుగా బతుకున్న వారు ఎందరో. తల్లిదండ్రులు లేక  అనాథలుగా ఉన్న పిల్లలు.. ఇలా అనేక సమస్యలతో బాల భారతం ప్రమాదంలో ఉన్నది. ఈ విషయం సమాజానికి అతి ముఖ్యమైన సమస్యగా పరిగణించాలి. ప్రభుత్వాలు, పౌర సమాజం ఈ దుస్థితినీ అత్యంత ముఖ్యమైనదిగా, ఎమర్జెన్సీగానూ గుర్తించాలి. ఈ సమస్యల మీద బాలల హక్కుల కార్యకర్తలు మీడియా ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాల ప్రతినిధులకు అనేక సార్లు తెలియజేస్తూనే ఉన్నా, ఎలాంటి ఫలితం ఉండటం లేదు. దోపిడీకి గురవుతున్న అత్యధిక శాతం బాలలు అణగారిన వర్గాల పేదవర్గాల పిల్లలే. పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే అభివృద్ధి పేరుతో నాలుగు, ఆరు, ఎనిమిది లైన్ల హైవేలు, ఎయిర్ పోర్టులు, ప్లై ఓవర్లు ఎవరికోసమో అర్థమే కాదు. బలవుతున్నది పేద వర్గాల పిల్లలు కాబట్టే పట్టింపులు లేవా ? లేక ఈ పిల్లలపై దృష్టి పెడితే ఓట్లు రాలవనే సమీకరణనా? అంతుచిక్కని ప్రశ్న. పోనీ ఓట్లు ఉన్న వారికి అయినా అన్ని హక్కులు అందుతున్నాయా అంటే లేదనే గణాంకాలు చెబుతున్నాయి. 

పెరుగుతున్న బాల కార్మికులు

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది కొత్తగా బాలకార్మికులుగా మారారని యూనిసెఫ్, అంతర్జాతీయ కార్మిక సంఘం నివేదికల ద్వారా స్పష్టమవుతున్నది. మన దేశం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. దేశంలో ఉన్న ఒకే ఒక్క పథకం జాతీయ బాలకార్మిక నిర్మూలన పథకం. దాన్నీ ఈ మధ్యే అర్ధాంతరంగా నిలిపి వేశారు. ఈ పథకం ద్వారా చదువుకున్న బాలలను పాఠశాలలో చేర్చకుండానే వదిలేశారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇటువంటి మూసి వేసిన పాఠశాల ఒకటి వెలుగులోకి వచ్చింది. బాల కార్మికులను పని నుంచి విముక్తి చేయడానికి  లేబర్ డిపార్ట్​మెంట్ కు తగినంత సిబ్బంది, వనరులు లేక పర్యవేక్షణ కరువైంది. బాలలతో పనిచేయించుకునే యాజమాన్యాలకు కఠిన శిక్షలు పడక పోవడం వల్ల బాలల శ్రమ దోపిడీ యధావిధిగా జరుగుతున్నది. పని ప్రదేశాల్లో బాలలను గుర్తించి పని నుంచి విడుదల చేసి విద్యను నేర్పించడానికి తగిన ఏర్పాట్లు జరగాలి.

బడికి వచ్చిన బాలలను

కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2021-–22 సంవత్సర సమగ్ర శిక్ష రిపోర్టు కార్డు ప్రకారం..16 నుంచి-17 ఏండ్ల పిల్లలు కేవలం 42 శాతం మాత్రమే బడుల్లో నమోదు అయినట్లు తేలింది. తెలంగాణలో కూడా 42 శాతం మంది మాత్రమే16  నుంచి17 సంవత్సరాల పిల్లలు పాఠశాలలో నమోదు అయ్యారని తెలుస్తున్నది. ఈ వయసు పిల్లలు  దాదాపు 58 శాతం మంది బడుల్లో నమోదు కాకుండా ఎక్కడున్నారు? అంటే బడి మానేసి పనుల్లో చేరిపోయారని అర్థం. మన విద్యావ్యవస్థ బడికి వచ్చిన పిల్లలు బడి మానేసే విధానాన్ని సహించింది, బడి బయట పిల్లలు ఉండడాన్ని సమర్థించుకుంటున్నది. వచ్చేటోళ్లకు చెబుతం, రానోళ్ల బాధ్యత మాది కాదు అనే ధోరణి నుంచి విద్యా శాఖ మారాలి. 2009 విద్యాహక్కు చట్టం వచ్చినా ఈ దృక్పథంలో మార్పురాలేదు. బడి మానేయడం, బడి బయట పిల్లలు ఉండవచ్చు అనే దృక్పథాన్ని విద్యావ్యవస్థ మార్చుకోవాలి.  ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికలు, మైనార్టీ పిల్లలను గౌరవంగా చూసే విధానాన్ని అలవరుచుకోవాలి. గౌరవ ప్రదమైన పాఠశాల విద్యను అందిస్తామనే భరోసానివ్వాలి.  బడిలో చేరి బడికి రాని పిల్లలను గుర్తించి పాఠశాల విద్య కమిటీ, గ్రామ పంచాయతీ సభ్యులు, పట్టణ ప్రాంతంలో వార్డు సభ్యులు బాలలను తిరిగి బడిలో చేర్పించే బాధ్యత తీసుకోవాలి. బాలల కోసం ఉన్న అనేక చట్టాలను అమలు జరిగేలా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్లు చురుగ్గా పని చేయాలి. వారి వద్దకు వచ్చిన కేసులనే కాకుండా బాలల హక్కుల ఉల్లంఘనలు జరగకుండా చూసే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. బాల్యవివాహాలు జరగకుండా స్థానిక ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. తమ పరిధిలో ఉన్న యుక్త వయసు పిల్లల జాబితాను సేకరించి ప్రతినెల పర్యవేక్షణ చేయాలి. తమ గ్రామాలను బాల కార్మిక, బాల్య వివాహాల రహిత గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి. అలాంటి పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేయాలి.

తల్లిదండ్రుల భాగస్వామ్యం

పేదలకు ప్రభుత్వ పాఠశాలల మీద, విద్యా వ్యవస్థ మీద నమ్మకాన్ని కలిగించే దిశగా మార్పు కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అదే విధంగా పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులను, గ్రామస్థులను, బస్తీ ప్రజలను నాణ్యమైన విద్యనందించే ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. వారికి బడుల్లో సముచితమైన స్థానం ఇవ్వాలి. అప్పుడే వారు నిజమైన భాగస్వాములుగా భావించి విద్య విషయంలో చురుగ్గా పాల్గొంటారు. తమ పిల్లల విషయంలోనే కాక తమ చుట్టూ ఉండే పిల్లలను తల్లిదండ్రులను కూడా ప్రోత్సహిస్తారు. బాలల హక్కుల పరిరక్షణకు వివిధ సంస్థలు పని చేస్తున్నాయి. ఒకరు చేసే పని ఇంకొకరికి తెలియకుండా పనులు జరుగుతుంటాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బాలల కోసం పనిచేసే ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో లేబర్, విద్యా శాఖ, డీసీపీయూ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్, లీగల్ సెల్ తదితర శాఖల ప్రతినిధులకు అవకాశం కల్పించాలి. తెలంగాణలో విద్య మీద రాష్ట్ర స్థాయిలో  సమగ్ర సమీక్షలు జరగడం లేదు. ఏదో కంటి తుడుపుగా ‘మన ఊరు మన బడి పథకం’ లేదా కొన్ని గురుకులాలను తెరవడం ద్వారా రాష్ట్రంలో18 ఏండ్లలోపు ఉన్న కోటి మందికి ప్రయోజనం కలగడం లేదనే విషయం పాలకులు గమనించాలి. బాల భారతం ప్రమాదంలో ఉంటే భవిష్యత్తు తరాలు గౌరవ ప్రదమైన జీవనం సాగించలేరు. నిరక్షరాస్యులుగా, నైపుణ్యం లేని కూలీలుగా, తక్కువ వేతనాలతో పని చేసే దోపిడీకి గురయ్యే కార్మికులుగానే మిగిలిపోతారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. 

ప్రైవేటు బడులపై దృష్టి పెట్టాలి

ప్రైవేటు బడుల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల విద్యా శాఖ ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. మన రాష్ట్రంలో దాదాపు 50 శాతం పైగానే పిల్లలు ప్రైవేటులో చదువుకుంటున్నారు. వారికి అందాల్సిన విద్యా సామర్థ్యాలు, పాఠ్యాంశాల బోధన, ఫీజుల నియంత్రణపై ఎలాంటి  శ్రద్ధ పెట్టడం లేదని అనేక సార్లు తల్లిదండ్రులు సంఘాలుగా, వ్యక్తులుగా రోడ్లు ఎక్కి నిరసన తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వేలకు వేలు ఫీజులు కట్టిన తమ పిల్లల చదువులు చట్టబండలే అని తెలిసి తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ల నియంత్రణకు ఒక స్వయం ప్రతిపత్తి గల కమిషన్ ను వేయాలి. లేదా ఉన్నత విద్య ఫీజుల నియంత్రణకు వేసినట్లుగా ఒక కమిటీని వేసి అన్ని విషయాలను నియంత్రించాలి. - ఆర్. వెంకట్ రెడ్డి, జాతీయ కన్వీనర్, ఎంవీ ఫౌండేషన్