ఆ ముగ్గురి ఆచూకీ చెప్పండి  .. ఎన్‌ఐఏ లుక్ఔట్​ నోటీసులు జారీ

  • నిజామాబాద్, జగిత్యాల, నెల్లూరు యువకులకు నిషేధిత పీఎఫ్ఐతో లింకులు ఉన్నట్లు నిర్ధారణ 

నిజామాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పాపులర్​ ఫ్రంట్​ఆఫ్​ ఇండియా (పీఎఫ్ఐ)తో సంబంధాలు ఉన్నాయంటూ నిజామాబాద్ ​మాలేపల్లికి చెందిన మహ్మద్​ అబ్దుల్​ అహ్మద్ అలియాస్ ​ఎంఏ అహ్మద్‌‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్​వాటెండ్ ​లిస్ట్​లో చేర్చింది. అతడిపై లుక్ఔట్​ నోటీస్​జారీ చేసినట్లు ఆదివారం జిల్లా పోలీసు కమిషనరేట్​కు సమాచారం అందింది. అతడితో పాటు జగిత్యాలకు చెందిన అబ్దుల్​సలీం, ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన షేక్​ ఇలియాస్​ అహ్మద్​ను మోస్ట్​ వాటెండ్ ​లిస్ట్​లో చేర్చామని.. ఆ ముగ్గురి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ఎన్ఐఏ వెల్లడించింది.

పేద విద్యార్థుల చదువుకు సహకరించే సంస్థగా ప్రచారం చేసుకున్న పీఎఫ్ఐ నగరంలో యువతను టెర్రరిజం వైపు మళ్లేలా ట్రైనింగ్​ఇస్తోందని 2022 జులైలో తేలింది. ఈ మేరకు షేక్​షాదుల్లా, అబ్దుల్ ​ఖాదర్​లపై నిజామాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్​నమోదు చేశారు. విచారణలో మొత్తం 28 మంది పేర్లు బయటకొచ్చాయి. నిజామాబాద్​కేంద్రంగా 400 మందికి పీఎఫ్ఐ ట్రైనింగ్​ఇచ్చారని తేల్చిన జిల్లా పోలీసులు కేసును ఆగస్టు నెలలో ఎన్ఐఏకు అప్పగించారు. ఎన్ఐఏ ఆఫీసర్లు నిజామాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు