రెండు నెలలుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ రెండు మ్యాచ్ లతో ముగియనుంది. ఇందులో భాగంగా నేడు (మే 24) సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2 లో తలబడుతన్నాయి. చెన్నైలోని చెపాక్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ క్వాలిఫయర్ 1 లో కేకేఆర్ ఓడిపోయి వస్తుంటే.. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై రాజస్థాన్ గెలిచింది. దీంతో కమ్మిన్స్ సేన ఒత్తిడిలో ఉంటే.. శాంసన్ సేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది.
ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టుతో పోలిస్తే రాజస్థాన్ జట్టు బలంగా కనిపిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తున్న రాజస్థాన్.. ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో SRH ఫ్యాన్స్ ఒక వింత కోరిక కోరారు. అదేంటో కాదు ఈ మ్యాచ్ లో వర్షం పడాలని. వర్షం పడి మ్యాచ్ రద్దయితే పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఈ టోర్నీ చివర్లో పలు మ్యాచ్ లకు వర్షం, అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి మ్యాచ్ లోనూ వర్షం పడాలని హైదరాబాద్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వర్షం పడుతుందా..?
చెపాక్ స్టేడియంలో ఇవాళ రాత్రి జరిగే క్వాలిఫయర్-2 వర్షం లేదా ఏదైనా కారణాలతో రద్దయితే రిజర్వ్ డే ఉంటుంది. రేపు కూడా మ్యాచ్ జరగకపోతే లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన SRH ఫైనల్‌కు చేరుకుంటుంది. టైటిల్ కోసం ఆదివారం KKRతో తలపడనుంది. అయితే ఇవాళ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో మంచు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ తీసుకునే అవకాశం ఉంది.