పెద్ద చదువులు చదివి, చిన్న పనులు చేయాలంటే నామోషీగా ఫీలవుతారు చాలామంది. కానీ, చిన్నపని అయినా కూడా మనసుపెట్టి చేస్తే శాటిస్ ఫ్యాక్షన్ ఉంటుంది అని నిరూపిస్తోంది ఈ అమ్మాయి. కోల్ కత్తాలోని హబ్రా రైల్వేస్టేషన్ లో ఆమె నడుపుతున్న ఛాయ్ బండి సమ్ థింగ్ స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే... ఆ బండి పెట్టింది ఎంఏ ఇంగ్లీషు చదివిన తుక్తుకి దాస్. ఛాయ్ండితో ఇంటర్నెట్ లో సెనేషన్ గా మారిని తుక్తుకి జర్నీ ఇది....
హబ్రా రైల్వే స్టేషన్ లో రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ మీద పసుపు పచ్చని ఛాయ్ బండి ఉంటుంది. ఆ ఛాయ్ బండి పేరు ఎంఏ ఇంగ్లీషు ఛాయ్ వాలీ. ఛాయ్ బండికి తన క్వాలిఫికేషన్ పేరు పెట్టింది 26 ఏండ్ల తుక్తుకి. సిస్టర్... ఒక కట్టింగ్ టీ. అట్లనే మీతో ఒక సెలీ కూడా ... రోజూ ఇలాంటి రిక్వెస్టులు తనకి కొత్తేమి కాదు. పెద్ద చదువు చదివి, ఛాయ్ అమ్ముతున్నందుకు ఆమె నామోషీగా ఫీలవ్వదు.
ఇన్ స్పైర్ అయ్యింది
కోల్ కత్తాలోని రబీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి కిందటి ఏడాది ఎంఏ ఇంగ్లీషు పాసైంది తుక్తుకి. జాబ్ కోసం ట్రై చేస్తున్న టైమ్ లో ఎంబీఏ చదివి ఛాయ్ బండి పెట్టి సక్సెస్ అయిన ప్రఫుల్ బిల్లోర్, ఛాయ్ వాలీ ఉప్మా విర్టీలని చూసి ఇన్ స్పైర్ అయింది. తను కూడా వాళ్ల లెక్కనే టీ బండి పెట్టి క్లిక్ అవ్వాలని డిసైడ్ అయింది. ఛాయ్ బండికి గిరాకీ ఎక్కువ ఉండే హాస్పిటళ్లు, కాలేజీలు, రైల్వేస్టేషన్.... ఈ మూడింటిలో ఏదో ఒక ప్లేస్ లో ఛాయ్ బండి పెట్టాలనుకుంది.
జాబ్ లేదంటే పెళ్లి
తుక్తుకి తండ్రి వ్యాన్ డ్రైవర్. అమ్మ చిన్నపాటి కిరాణా దుకాణం నడుపుతోంది. తుక్తుకికి ముగ్గురు తోబుట్టువులు. ఆమె తల్లిదండ్రులు వచ్చే కొద్ది ఆదాయంతోనే ముగ్గురు పిల్లల్ని చదివించేవాళ్లు. పిల్లలు పెద్ద జాబ్ తెచ్చుకుంటే చూసి మురిసిపోవాలి అనుకున్నారు. తుక్తుకి ఎంఏ పాస్ ‘బాగా చదివి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకో. లేదంటే పెళ్లి చేస్తాం' అని చెప్పేశారు. కానీ, తను ఛాయ్ బండి నడుపుతా అని చెప్పినప్పుడు మొదట్ లో టెన్షన్ పడ్డారు. సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలి అనుకుంటున్న కూతురి పట్టుదలని కాదనలేక ఓకే చెప్పారు.
వెరైటీ ఛాయ్ లతో ఫేమస్
ఛాయ్ బండి పెట్టడంతోనే తన కల నిజమైంది అనుకోలేదు తుక్తుకి. ఛాయ్ పెట్టడం నేర్చుకుంది. గిరాకీ పెంచుకోవడం, వ్యాపారంలో పోటీని తట్టుకోవడం ఎలాగో తొందరగానే నేర్చుకుంది. ఎంఏ ఇంగ్లీషువాలీ ఛాయ్ బండి దగ్గర దాదాపు అన్నిరకాల టీలు దొరుకుతాయి. మసాలా ఛాయ్, అల్లం టీతో పాటు బ్లాక్ జింజర్ టీ, డార్జిలింగ్ టీ, లెమన్/ నల్ల మిరియాల టీ, యాలకుల టీ, యాలకులు అల్లం టీ, యాలకులు దాల్చినచెక్క, చాక్లెట్ టీ... ఇన్ని వెరైటీ టీలు అమ్ముతోంది తుక్తుకి. మొదటి ప్రయత్నంతోనే సక్సెస్ చూసింది. ఇలాంటి ఛాయ్ బండ్లు మరి కొన్ని పెట్టాలనే ఆలోచనలో ఉంది ఈ యంగ్ స్టర్.
ఏ పనీ తక్కువ కాదు
నాకు ఎప్పటి నుంచో సొంతంగా బిజినెస్ పెట్టాలనే ఆలోచన ఉండేది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్లు తమ పిల్లలు కష్టపడి చదివి. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని కలలు కంటారు. మా పేరెంట్స్ కూడా నన్ను గవర్నమెంట్ ఉద్యోగిగా చూడాలి అనుకున్నారు. కానీ, నాకు సొంతంగా ఏదైనా చేయాలని ఉండేది. కానీ మా కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అందుకే చిన్న చిన్న ఖర్చులకి అమ్మానాన్నలని పైసలు అడగడం ఇష్టంలేక ట్యూషన్లు చెప్పేదాన్ని. ట్యూషన్లు చెప్పగా వచ్చిన దాంట్లో కొంత దాచుకునేదాన్ని. ఎంఏ చదివిన తర్వాత నా కలని నిజం చేసుకోవాలనుకున్నా.
అప్పుడు నాకు ఛాయ్ బండి బెస్ట్ ఆప్షన్ అనిపించింది. పది వేల రూపాయల పెట్టుబడితో ఈ ఏడాది నవంబర్ 1న నా కలల ప్రయాణాన్ని మొదలుపెట్టాను. రైల్వేస్టేషన్లో ఛాయ్ అమ్మేవాళ్లని కొందరు చిన్నచూపు చూడడం బాధగా అనిపిస్తుంది. నా దృష్టిలో అన్ని పనులు గౌరవించదగ్గవే. ఏ పనిలో ఉండే కష్టం ఆ పనిలో ఉంటుంది. అని చెబుతోంది ఈ యంగ్ ఎంట్రప్రెనూర్.