MAA in Action: ట్రోల్ చేసే ఆ యూట్యూబర్లు టెర్రరిస్టులతో సమానం..డీజీపీకి ‘మా’ ఫిర్యాదు

MAA in Action: ట్రోల్ చేసే ఆ యూట్యూబర్లు టెర్రరిస్టులతో సమానం..డీజీపీకి ‘మా’ ఫిర్యాదు

MAA (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ మంచు విష్ణు (Manchu Vishnu) ట్రోలింగ్, అసభ్యకరమైన వీడియోలు చేసే వారి పట్ల ఇటీవలే అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్లకు వార్నింగ్ ఇస్తూ..పలు ఛానల్స్ కూడా రద్దు అయ్యేలా చేశాడు.

తాజా విషయానికి వస్తే..నటీనటులపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబర్లపై మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. అసోసియేషన్ తరపున శివబాలాజీ, రాజీవ్ కనకాల, సీనియర్ నటుడు శివకృష్ణలు డీజీపీని కలిసి తమ ఫిర్యాదును అందజేశారు.  

ఇప్పటికే ఓ ఐదు యూట్యూబ్ చానళ్లను రద్దు చేసిన మా..మరిన్ని ట్రోలింగ్ చేస్తున్న ఛానళ్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. తెలంగాణ డీజీపీని కలిసిన అనంతరం మా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు పంచుకున్నారు.  ఈ మేరకు మా ప్రతినిధులు మరో 200 యూట్యూబ్ ఛానళ్లపై కంప్లైంట్ చేసినట్లు తెలుపగా..ఇకపై సోషల్ మీడియాలో నటులపై వస్తున్న ట్రోల్స్ పై చర్యలు తీసుకోవాలని  డీజీపీని కోరారు.

అలాగే ఇప్పటి వరకు 25 యూట్యూబ్ ఛానళ్ళను బ్యాన్ చేశామని..తక్షణమే మరో ఐదు చానళ్లను నిషేదించాలని కోరుతూ ఈ సందర్భంగా డీజీపీకి తమ ఫిర్యాదు కాపీని అందజేశారు. ఇక ప్రత్యేకంగా మా దాంట్లో సైబర్ క్రైమ్ టీమ్ పెట్టుకున్నామని కూడా డీజీపీకి వెల్లడించారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ తో కలిసి కో ఆర్డినేషన్ కమిటి ఏర్పాటు చేయబోతున్నామని కూడా మా టీమ్ సందర్భంగా వెల్లడించింది. 

అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం అని..అసభ్యకరంగా లేడీ ఆర్టిస్టులపై వస్తున్న ట్రోల్ చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు. అందువల్ల తమ కుటుంబాలు చాలా బాధ పడుతున్నాయని, క్యారెక్టర్ ను కించ పరిచేలా ట్రోల్ చేస్తున్నారని, పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. వీటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు డీజీపీ ని కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ అంశాలపై  డీజీపీ సానుకూలంగా స్పందించారని..సైబర్ సెక్యూరిటీ వింగ్లో స్పెషల్ సెల్ దీనిమీద ఫోకస్ పెడుతుందని చెప్పారని వెల్లడించారు. డిపార్ట్మెంట్ అండ్ సినిమా వాళ్ళం సమన్వయం చేసుకుని ఇలాంటి వారిపై తక్షణమేచట్టపరమైన  చర్యలు తీసుకుంటామని నటుడు శివ బాలాజీ అన్నారు. 

ఇకపై ఏ మాత్రం ఉపేక్షించేది లేదంటూ నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై మా అసోసియేషన్ కొరడా విధించడంతో మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే..'అణచివేత మొదలైంది. నటీనటులు, వారి కుటుంబాలు మరియు వ్యక్తిగత దాడుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు..ఐదు యూట్యూబ్ ఛానెల్‌లు రద్దు చేయబడ్డాయి.ఇది ప్రారంభం మాత్రమే.భవిష్యత్‌లో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని" ఎక్స్‌వేదికగా మా పోస్ట్‌ చేసింది.