
హైదరాబాద్, వెలుగు: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సస్పెండ్ చేసింది. పోలీసుల దర్యాప్తులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు కన్ఫామ్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించారు. హేమపై చర్యలు తీసుకునే విషయమై బుధవారం 'మా' ప్యానెల్ సమావేశం సుధీర్ఘంగా చర్చించినా.. ఎలాంటి నిర్ణయం ఫైనల్ కాలేదు. దీంతో మరోసారి సభ్యుల అభిప్రాయాలను కోరుతూ 'మా' అసోసియేషన్ గ్రూపులో మెసేజ్ పెట్టగా.. ఎక్కువ మంది హేమను సస్పెండ్ చేయాలని రిప్లై ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆమెను 'మా' అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మంచు విష్ణు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు మా సభ్యులకు తెలియజేశారు. డ్రగ్స్ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా.. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ముందు ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ తెలిపారు. కానీ, వైద్య పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. దీంతో.. ఇటీవలే ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.