- వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
భద్రాచలం, వెలుగు : ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పనిదినాలు కల్పించాలని, కొలతలతో సంబంధం లేకుండా కనీస వేతనం రోజుకు రూ.600 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎంపీడీవో ఆఫీసులో మంగళవారం కూలీలతో కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు తగ్గిస్తూ కోత విధిస్తోందని ఆరోపించారు. మే నెలలో మండుటెండలో పని చేసినా నేటికీ వారికి కూలి ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కార్మికుల కోసం కేంద్రం ప్రకటించిన రూ.12వేల పథకాన్ని వెంటనే అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం స్వామి, ఉపాధి కూలీలు కోర్స రమణ, కోలా గంగ, ఆది, శ్రీనివాస్, పోశాలు తదితరులు పాల్గొన్నారు.