- నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులు
- ఇంటి పెద్దను కోల్పోగా సాయమందించి అంత్యక్రియలు
- కూతురి పేరిట రూ.1.20 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్
జమ్మికుంట, వెలుగు: ఇంటి పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచనపల్లికి చెందిన ఒజ్జ వెంకటేశ్(30) కొద్ది రోజుల కింద అనారోగ్యంతో చనిపోయాడు. ఇతనికి భార్య కోమల, కొడుకు, కూతురు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో వెంకటేశ్ అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో గ్రామస్తులంతా కలిసి దహస సంస్కారాలు నిర్వహించారు.
అంతేకాకుండా కొందరు పెద్దలు తమకు తోచిన సాయం అందించడమే కాకుండా రూ. లక్ష 40 వేలను సేకరించారు. అంత్యక్రియలకు 20,000 ఖర్చుచేయగా.. మిగతా నగదును మృతుడి కుమార్తె పేరిట ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన కింద1,20,000 ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. సోమవారం ఆ పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. గ్రామస్తులు తామంతా అండగా ఉన్నామని ముందుకొచ్చి చేయూతనివ్వడం బాధిత కుటుంబానికి భరోసాను ఇచ్చింది.