
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన గూటికి చేరారు. ఇప్పటికే జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించిన బాలశౌరి.. ఆదివారం( ఫిబ్రవరి 4) సాయంత్రం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తీరుపై బాలశౌరి తీవ్ర విమర్శలు చేశారు. సిద్ధం పేరుతో సభలు పెడుతున్నారు .. దేనికి సిద్ధం పారిపోవడానికి సిద్ధమా అంటూ సెటైర్లు వేశారు . జనసైనికులు సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని వేటాడతారని వల్లభనేని బాలశౌరీ హెచ్చరించారు.
ఎన్నికలు దగ్గర పడే కొలది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి.వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారిపోతున్న నాయకుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారం విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదే సమయంలో టికెట్ రాని నేతలు ఆ పార్టీలకు రాజీనామా చేసి ఇతర పార్టీలలో జాయిన్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.
మచిలీపట్నం ఎంపీ, వైసీపీ నేత వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలశౌరి జనసేన కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి బందరు, అవనిగడ్డ, గుంటూరు నుంచి బాలశౌరి మద్దతుదారులు, అనుచరులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలశౌరి వైసీపీ ప్రభుత్వం మీద, సీఎం జగన్ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు.
సిద్ధం సభల్లో తానెప్పుడూ అబద్ధం చెప్పలేదని ముఖ్యమంత్రి జగన్ చెప్తున్నారన్న బాలశౌరి.. అదే పెద్ద అబద్ధమంటూ విమర్శించారు. సిద్ధం అంటూ సభలు పెడుతున్న జగన్ పారిపోవటానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఎక్కడికి పారిపోయినా జనసైనికులు మిమ్నల్ని వెంటాడుతారని అన్నారు. నాకు దేవుడున్నాడంటూ పదే పదే చెప్పే జగన్.. దేవుడి తరుఫున వకాల్తా తీసుకున్నారా అంటూ సెటైర్లు పేల్చారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని చెప్పిన జగన్.. అధికారంలోకి రాగానే మాట మార్చలేదా అని ప్రశ్నించారు. విపక్షంలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన రాజధానిని అమరావతిలో కట్టండని చెప్పలేదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఏపీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న బాలశౌరి.. ఏపీ అభివృద్ధిలో నడవాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. జనసేన ప్రభుత్వంలో చేయాల్సిన పనులు చాలా వున్నాయన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ.
ఈ రోజు ( ఫిబ్రవరి 4 ) నుంచి తాను జనసేన కార్యకర్తనని చెప్పిన బాలశౌరి.. పవన్ కళ్యాణ్ ఏ పదవి ఇచ్చినా ఆనందంగా, నిబద్ధతతో పనిచేస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్‌తో పని చేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. పార్టీని నడపడమంటే ఆషామాషీ కాదని బాలశౌరి అభిప్రాయపడ్డారు. కేవలం సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్‌తోనే పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతున్నారని చెప్పుకొచ్చారు.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో మచిలీపట్నం ఎంపీ శ్రీ @VBalashowry గారు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.#HelloAP_ByeByeYCP
— JanaSena Party (@JanaSenaParty) February 4, 2024
Link: https://t.co/5Z7wCXhtvI pic.twitter.com/3PoHtVDKqg
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో తెనాలి ఎంపీగా బాలశౌరి విజయం సాధించారు. 2019లో మచిలీపట్నం నుంచి వైసీపీ తరుఫున ఎంపీగా గెలిచిన బాలశౌరి.. వైసీపీలో ఇటీవల జరిగిన పరిణామాలతో అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి రాజీనామా చేసిన బాలశౌరి.. ఆదివారం జనసేన కండువా కప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన తరుఫున మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.