Viswam Review: శ్రీనువైట్ల కమ్బ్యాక్ ఇచ్చాడా..? గోపీచంద్కు హిట్ దక్కిందా..?

Viswam Review: శ్రీనువైట్ల కమ్బ్యాక్ ఇచ్చాడా..? గోపీచంద్కు హిట్ దక్కిందా..?

హీరో గోపీచంద్ అనగానే యాక్షన్‌ సినిమాలు గుర్తొస్తాయి. అలాగే దర్శకుడు శ్రీనువైట్ల పేరు చెబితే కామెడీ ఎంటర్‌‌టైనర్స్‌ గుర్తొస్తాయి. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘విశ్వం’ అనే యాక్షన్ ఎంటర్‌‌టైనర్ వచ్చింది.  కావ్యా థాపర్ హీరోయిన్.  చిత్రాలయ స్టూడియోస్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మించాయి.  దసరా సందర్భంగా శుక్రవారం (11–10–2024) విడుదలైన  ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.  

కథ ఏంటంటే.?
హైదరాబాద్ సిటీలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది.  ఆ బ్లాస్ట్ ఎవరో చేశారో  తెలిసిన మినిష్టర్‌‌ (సుమన్‌)ను చంపేస్తారు.  ఆ హత్యను చూసిన ఓ చిన్నారిని చంపేందుకు వరుస అటాక్‌లు జరుగుతుంటాయి. ఆ పాప  కుటుంబానికి పరిచయమైన గోపీరెడ్డి (గోపీచంద్‌) తన ప్రాణాలకు తెగించి కాపాడుతుంటాడు.  అయితే ఆ చిన్నారి కుటుంబంలోని సమీరా (కావ్య థాపర్‌‌) అతనికి ముందే ఇటలీలతో పరిచయం ఉంటుంది.  పాపను కాపడాటానికే అతను వచ్చాడా..  విశ్వం అనే తన పేరును ఎందుకు గోపీరెడ్డిగా మార్చుకున్నాడు... అసలు ఎవరీ విశ్వం.. అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి..  బాంబ్ బ్లాస్ట్‌ల వెనుక ఉన్నది ఎవరు.. లాంటి విషయాలు  తెలియాలంటే ‘విశ్వం’ సినిమా చూడాల్సిందే. 

నటీనటులు ఎలా చేశారంటే.? 
ఎప్పటిలాగే తనకు బాగా అలవాటైన యాక్షన్‌ సీక్వెన్స్‌లో మాస్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు గోపీచంద్. అలాగే ‘లౌక్యం’ తర్వాత మళ్లీ ఈ సినిమాలో కామెడీతో ఎంటర్‌‌టైన్ చేశాడు గోపీచంద్.  మరోసారి గ్లామర్‌‌ రోల్‌లో కనువిందు చేసింది కావ్యాథాపర్.  విలన్‌గా నటించిన  జిషు సేన్ గుప్తాకు కూడా ఇది అలవాటైన  పాత్రే.  సునీల్ కామెడీ విలన్‌గా కనిపించాడు. రాహుల్ రామకృష్ణ,  థర్టీ ఇయర్స్ పృథ్వీ,  వెన్నెల కిషోర్, వీటీవీ గణేషన్, నరేష్, ప్రగతి, అజయ్ ఘోష్,  షకలక శంకర్,  గిరి నవ్వించారు.  

సాంకేతిక నిపుణుల పనితీరు. 
పాటలతో పాటు నేపథ్య సంగీతం విషయంలో చైతన్ భరద్వాజ్ ఈ  సినిమాకు ప్లస్‌ పాయింట్‌గా నిలిచాడు.  భీమ్స్ ఒకే పాట ఇచ్చినప్పటికీ మాస్‌ బీట్‌తో తన మార్క్ చూపించాడు.  కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ  వర్క్ బాగుంది. విదేశీ లొకేషన్స్‌లో తీసిన సీన్స్, డ్రోన్ షాట్స్ లాంటివి  ఇంప్రెస్ చేశాయి.  పాటలు కలర్‌‌ఫుల్‌గా ఉన్నాయి. గ్రాఫిక్స్ నాసిరకంగా అనిపించాయి.  అది మినహా ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ విషయంలో నిర్మాతలు ఎక్కడా  రాజీ పడలేదు.  

ఎలా ఉందంటే.?
కొంత గ్యాప్ తర్వాత శ్రీనువైట్ల నుంచి సినిమా వస్తుండడంతో ఈసారి ఎలాంటి సబ్జెక్ట్‌తో ఎంటర్‌‌టైన్ చేయబోతున్నాడు అనే ఆసక్తి ప్రేక్షకులు ఏర్పడింది.  ముఖ్యంగా తన మార్క్ ఎంటర్‌‌టైన్మెంట్ ఫార్మట్‌ను ఆయన బ్రేక్ చేస్తాడా లేదా అనే ఆసక్తి ఉంది.  కానీ హీరో తన ఐడెంటిటీ దాచి హీరోయిన్‌ ఇంటికి వెళ్లడం అనే టెంప్లెట్‌ను ఆయన ఇందులోనూ ఫాలో అయ్యాడు.  కానీ కథ విషయంలో మార్పలు చేశాడు. అలాగని అవేవి అద్భుతమైన మార్పులేవీ కావు. ఎప్పటి నుంచో తెలుగు సినిమాల్లో చూస్తున్నవే.   అయితే తన ప్రధాన బలమైన కామెడీని వాడుకున్నాడు.  ఫస్ట్ హాఫ్‌లో థర్టీ ఇయర్స్ పృథ్వీ సీన్స్ ఫుల్‌గా నవ్విస్తాయి. సెకెండాఫ్‌లో వెన్నెల కిషోర్‌‌ అంతకు మించి ఎంటర్‌‌టైన్ చేస్తాడు. 

ప్రమోషన్‌లో ఎక్కువగా చెప్పిన ట్రైన్ ఎపిసోడ్‌ కొంత వర్కవుట్ అయినప్పటికీ ‘వెంకీ’ స్థాయిలో మాత్రం కాదు.  ఎంటర్‌‌టైన్మెంట్ విషయంలో శ్రీనువైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చు.  కానీ గతంలో ఆయన కొన్ని చిత్రాల్లో చేసిన ఎంటర్‌‌టైన్మెంట్ విత్ యాక్షన్ బ్లెండ్‌ ఈ సినిమా విషయంలో కుదరలేదు. లాజిక్స్ లేకుండా సాగిన టెర్రరిస్ట్‌ బ్యాక్‌డ్రాప్ సీన్స్‌, క్లైమాక్స్‌ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ముఖ్యంగా సెకెండాఫ్​లో కథ ఏమిటో ప్రేక్షకులు ముందుగానే ఊహించేలా సాగింది.  దీంతో రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాలా తయారైంది.  స్క్రీన్ ప్లే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని,  సెకెండాఫ్​పై కూడా ఇంకాస్త దృష్టి సారించి ఉండే ఫలితం మరో స్థాయిలో ఉండేది.  

ఫైనల్‌గా..  
రొటీన్ కమర్షియల్ ఫార్ములాతో సాగే యాక్షన్ ఎంటర్‌‌టైనర్ ఇది. శ్రీనువైట్ల సినిమాల్లోని కామెడీని మాత్రమే ఆశించి థియేటర్‌‌కు వెళ్తే హాయిగా నవ్వుకోవచ్చు.

  • Beta
Beta feature