హైదరాబాద్: గచ్చిబౌలి పరిధిలోని సిద్దిక్ నగర్ నగర్లో 2024, నవంబర్ 19వ తేదీ రాత్రి ఐదంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిన విషయం తెలిసిందే. స్థానికులను భయాందోళనకు గురి చేసిన ఈ ఘటనలో బిల్డర్ శ్రీను, ఇంటి యజమాని యాసిన్ ఖాన్‌పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిక్ నగర్లో ప్రమాదానికి గురైన బిల్డింగ్ పక్కన మరో నిర్మాణానికి బిల్డర్ శ్రీను, ఇంటి యజమాని యాసిన్ ఖాన్ గుంతలు తవ్వడంతోనే ఐదంతస్తుల భవనం పక్కకు వంగిందని.. భవనం ఒక వైపుకు ఒరగడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిల్డర్ శ్రీను, యజమాని యాసిన్ ఖాన్ ఎటువంటి సెట్ బాక్స్ లేకుండా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా గుంతలు తవ్వారని శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్ వెంకటరమణ కంప్లైంట్ చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బిల్డర్ శ్రీను, ఇంటి యజమాని యాసిన్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మంగళవారం (నవంబర్ 19) రాత్రి ఐదంతస్తుల భవనం పక్కకు ఒరగడంతో అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. దీంతో పక్కకు ఒరిగిన బిల్డింగ్ వాసులతో పాటు స్థానికులను ఖాళీ చేయించిన అధికారులు.. బుధవారం (నవంబర్ 20) ప్రమాదానికి గురైన భవనాన్ని నేలమట్టం చేశారు.