హైదరాబాద్: మాదాపూర్లో ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన ఆ సంస్థ పేరు సినార్జీ యూనివర్సల్ కంపెనీ. మాదాపూర్ కావూరి హిల్స్లోని వివి చాంబర్స్ నాలుగో అంతస్తులో సినార్జీ యూనివర్సల్ కంపెనీ ఆఫీస్ ఉంది.
ఉద్యోగాలు ఇస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి 3 లక్షల రూపాయలు వరకూ కంపెనీ యాజమాన్యం వసూలు చేసింది. ఆఫర్ లెటర్ చేతికిచ్చి వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి ఆరు నెలలు గడిపిన కంపెనీ యాజమాన్యం చివరకు ఇలా హ్యాండిచ్చింది. ఇలా సుమారు 500 మంది వద్ద నుంచి సినార్జీ యూనివర్సల్ కంపెనీ డబ్బులు వసూలు చేసింది.
గత ఆరు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో కంపెనీ యాజమాన్యాన్ని ఉద్యోగులు ప్రశ్నించారు. కంపెనీకి ప్రాజెక్టులు లేవని ఉద్యోగులతో కంపెనీ యాజమాన్యం తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి కంపెనీ యాజమాన్యం ఆఫీస్కి రాకపోవడంతో మోసపోయామని ఉద్యోగులు ఆలస్యంగా గ్రహించారు. మోసపోయామని తెలుసుకొని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. కంపెనీ చేసిన మోసం కోట్లలో ఉండడంతో EOWలో (ఆర్థిక నేర విభాగం) ఫిర్యాదు చేయాలని మాదాపూర్ పోలీసులు బాధితులకు తెలిపారు.