
తాండూరు, వెలుగు: ఫిల్టర్ బెడ్ల నిర్వహణలో సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంపులు, మోటార్లు చెడిపోయి రోజుల తరబడి నీటి సరఫరాకు అంతరాయం కలడంతో తాండూర్ మండలంలోని మాదారం టౌన్షిప్వాసులు నీటి కోసం తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీటి సమస్య తీర్చాలని బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో గోలేటి, ఖైరిగూడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. నీటి సమస్యపై సింగరేణి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నాయకులు మద్దతు పలికారు.
వన్ ఇంక్లయిన్ నుంచి ఫిల్టర్ బెడ్‌కు నీటిని సరఫరా చేసే పంపుల రిపేర్లు చేపట్టి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. ఆందోళన నేపథ్యంలో బెల్లంపల్లి ఏరియా సివిల్డీజీఎం భాషా మాదారం ఫిల్టర్ బెడ్‌ను సందర్శించారు. నీటిఎద్దడిని తీర్చడానికి చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. నిరసనలో ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రకాశ్‌రావు, కార్యదర్శి రామారావు, ఏరియా కార్యదర్శి చంద్రకుమార్, నాయకులు రఘునాథ్‌రెడ్డి, బాపురెడ్డి, ఏఐటీయూసీ నాయకులు బి.మొగిలి, పి.శంకర్ తదితరులు పాల్లొన్నారు.