డ్రగ్స్ ఎవరిచ్చారు..మీ ఫోన్ ఎక్కడుంది.. విజయ్ మద్దూరికి పోలీసుల ప్రశ్నల వర్షం

డ్రగ్స్ ఎవరిచ్చారు..మీ ఫోన్ ఎక్కడుంది.. విజయ్ మద్దూరికి పోలీసుల ప్రశ్నల వర్షం
  • నేను నెదర్లాండ్స్​లో డ్రగ్స్ తీసుకున్నా.. ఇక్కడ తీసుకోలేదని సమాధానం
  • మూడు గంటల పాటు కొనసాగిన ఇంటరాగేషన్​

చేవెళ్ల, వెలుగు: జన్వాడా ఫామ్‌‌‌‌ హౌస్‌‌‌‌ కేసులో మాజీ మంత్రి కేటీఆర్​బావమరిది రాజ్​పాకాల స్నేహితుడు విజయ్​మద్దూరిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మోకిల పోలీసుల విచారణకు ఆయన హాజరయ్యారు. విచారణకు అడ్వొకేట్‌‌‌‌ను అనుమతించాలని హైకోర్టు ఆదేశించడంతో ఆయన తన లాయర్లతో కలిసి ఉదయం 11 గంటలకు స్టేషన్‌‌‌‌కు వచ్చారు. మూడు గంటల పాటు జరిగిన విచారణలో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.

జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విజయ్​ఏ2గా ఉన్నారు. ‘‘పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సప్లయ్ చేశారు? కొకైన్ ఎవరు ఇచ్చారు? ఆ కొకైన్ ఎక్కడిది? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎంత మంది వాడారు? పార్టీలో ఎంత మంది ఉన్నారు? విదేశీ మద్యం ఎక్కడిది? ఎక్కడి నుంచి తెచ్చారు? మీరు డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నారు?’’అని పోలీసులు ప్రశ్నించారు. దీనికి విజయ్ ‘నేను నిజం చెబుతున్నా.. గత నెల 10 నుంచి 14 వరకు నెదర్లాండ్‌‌‌‌లో ఉన్నా.. అక్కడ నా సన్నిహితుల ద్వారా కొకైన్ తీసుకున్నా. ఇక్కడ డ్రగ్స్ తీసుకోలేదు’అని సమాధానమిచ్చాడు. ‘మీరు చెప్పిందే నిజమైతే.. నెదర్లాండ్‌‌‌‌లో కొకైన్ తీసుకుంటే బ్లడ్‌‌‌‌లో నాలుగు రోజులు, యూరిన్‌‌‌‌లో రెండ్రోజులు మాత్రమే ఉంటుంది. మరి 26వ తేదీ వరకు డ్రగ్స్ ఆనవాళ్లు ఎలా ఉన్నాయ్? అని పోలీసులు ప్రశ్నించారు.

‘ఏమో నాకు తెలియదు.. నేను మాత్రం నెదర్లాండ్స్‌‌‌‌లోనే తీసుకున్నా’అని విజయ్‌‌‌‌ సమాధానం చెప్పాడు. ‘నేను నెదర్లాండ్‌‌‌‌కు వెళ్లిన్నప్పుడల్లా డ్రగ్స్​తీసుకుంటా..’అని వెల్లడించాడు. ‘పార్టీలో పాల్గొన్న మీరు ఫోన్ ఎక్కడ పెట్టారు ? ఎవరి చేతికిచ్చారు?’అని ప్రశ్నించగా ‘పార్టీలో ఉన్నప్పుడు నా ఫోన్‌‌‌‌ చార్జింగ్ పెట్టమని ఎవరికో ఇచ్చాను.. వాళ్లెవరో తెలియదు’అని చెప్పాడు. మరి మీ ఫోన్ ఎవరికో ఇచ్చినప్పుడు వేరే వాళ్ల ఫోన్ ఎందుకు ఇచ్చినట్టు? ఎవరు చెప్తే ఇచ్చారు? ఎవరెవరికి లింక్‌‌‌‌లు ఉన్నాయి? అని పోలీసులు అడగగా, కోర్టు ఇచ్చిన మూడు గంటల సమయం ముగియడంతో విజయ్‌‌‌‌ను పంపించి వేశారు. 

ఫోన్ దొరికితేనే సీక్రెట్స్ బయటకు..

విజయ్ ఫోన్ దొరికితే గానీ డ్రగ్స్ లింక్‌‌‌‌లు బయటకు వచ్చేటట్లు లేవు. ప్రస్తుతం విజయ్​మద్దూరి ఫోన్​ స్విచ్ఛాఫ్​చేసి ఉంది. మరోవైపు మోకిల పోలీసులు చార్జీషీట్ నమోదు చేసే వరకు విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ఫాంహౌస్​పార్టీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్ వైజర్ కార్తీక్​, కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల, రాయదుర్గంలోని విల్లాలో ఫారిన్ మందు బాటిల్స్‌‌‌‌తో​దొరికిన నాగేశ్వర్​రెడ్డితో పాటు విజయ్ మద్దూరి విచారణ కూడా దాదాపు పూర్తయ్యింది.

మళ్లీ వీరిని ఎప్పుడైనా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అలాగే ఆ రోజు దావత్‌‌‌‌లో పాల్గొన్న 21 మంది పురుషుల్లో రోజుకు 5 మంది చొప్పున స్టేట్‌‌‌‌మెంట్ రికార్డు చేశారు. ఇంకా 16 మంది మహిళలు, నలుగురు పిల్లలను విచారించాల్సి ఉంది. మహిళలను, పిల్లలను విచారించేందుకు ఉన్నతాధికారులు, కోర్టు నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని సమాచారం.