మార్కెట్లతో రూ.14.27 లక్షల కోట్ల సమీకరణ: సెబీ చీఫ్

  • వెల్లడించిన సెబీ చీఫ్​ మాధవీ పురి

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్​మార్కెట్ల ద్వారా కంపెనీలు రూ.14.27 లక్షల కోట్లను సేకరించే అవకాశం ఉందని సెబీ చీఫ్ ​మాధవీ పురి అన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.11.8 లక్షల కోట్లు సేకరించాయని చెప్పారు. 

గత తొమ్మిది నెలల్లో సంస్థలు డెట్​మార్కెట్ల నుంచి రూ.7.3 లక్షల కోట్లు, ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.3.3 లక్షల కోట్లు సమీకరించాయని వెల్లడించారు. రియల్​ ఎస్టేట్​ఇన్వెస్ట్​మెంట్స్​ట్రస్ట్స్​, ఇన్‌ ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ​ట్రస్ట్స్​, మున్సిపల్​ బాండ్ల ద్వారా ఈ తొమ్మిది నెలల్లో రూ.10 వేల కోట్లు మాత్రమే సమకూరాయని చెప్పారు. 

స్మాల్, మీడియం ఎంటర్​ప్రైజెస్​ల (ఎస్​ఎంఈలు) బోర్డు ప్రపోజల్స్​కు మరింత త్వరగా ఆమోదం తెలుపుతామని ఆమె హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎస్​ఎంఈల ప్రపోజల్స్​కు గ్రీన్​సిగ్నల్​ రావడానికి మూడు నెలల వరకు పడుతోంది. 

ఐపీఓలకు బాగా డిమాండ్​ ఉందని, వీటి కోసం కంపెనీల నుంచి విపరీతంగా దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. ప్రిఫరెన్షియల్​ ఇష్యూలు, ఇన్​స్టిట్యూషనల్​ ప్లేస్​మెంట్స్​, రైట్స్​ఇష్యూలు కూడా ముఖ్యమైనవే అయినా, వీటికి తగినంత ఆదరణ రావడం లేదని మాధవి అసంతృప్తి వ్యక్తం చేశారు.