
దేశంలోని పులుల జనాభాను సంరక్షించాలన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్ చంబల్ ప్రాంతంలోని శివపురి జిల్లాలో ఉన్న మాధవ్ నేషనల్ పార్క్‌ను మధ్యప్రదేశ్‌లో 9వ టైగర్ రిజర్వ్‌గా, దేశంలో 58వ టైగర్ రిజర్వ్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎగువ వింధ్య పర్వతాల్లో దాదాపు 355 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాధవ్ నేషనల్ పార్క్ విస్తరించి ఉన్నది.
దీనిని1958లో నేషనల్ పార్క్‌గా ప్రకటించారు. ఈ నేషనల్ పార్క్‌లో ఇటీవల జన్మించిన కూనలతో సహా ప్రస్తుతం ఐదు పులులు ఉన్నాయి. మరో రెండు పులులను త్వరలో విడుదల చేయనున్నారు. ఈ టైగర్ రిజర్వ్‌లో పులుల జనాభాను సంరక్షించేందుకు ఎన్టీసీఏ నుంచి నిధులు కూడా అందుతాయి.
మధ్యప్రదేశ్‌లోని టైగర్ రిజర్వులు
కన్హా, సత్పురా, బాంధవ్‌ఘర్, పెంచ్, సంజయ్దుబ్రి, పన్నా, వీరాంగన దుర్గావతి, రతపాని టైగర్ రిజర్వ్, మాధవ్ నేషనల్ పార్క్
టైగర్ రిజర్వ్‌ల సంఖ్య 58
దేశంలో 56వ టైగర్ రిజర్వ్‌గా చత్తీస్‌గఢ్‌లోని గురు ఘాసిదాస్–తామోర్పింగ్లా టైగర్ రిజర్వ్, 2024లో 57వ టైగర్ రిజర్వ్‌గా మధ్యప్రదేశ్‌లోని రతపాని ఫారెస్ట్ టైగర్ రిజర్వ్, ప్రస్తుతం మాధవ్ నేషన్ పార్క్58వ టైగర్ రిజర్వ్‌గా గుర్తింపు పొందడంతో భారతదేశంలో టైగర్ రిజర్వుల సంఖ్య 58కి చేరుకున్నది.
దేశంలో పులుల జనాభా
ప్రపంచంలోని మొత్తం పులుల జనాభాలో 70 శాతానికి పైగా భారతదేశంలో ఉంది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 3167 పైగా పులులు ఉన్నాయి. అయితే, 2018లో 2967, 2014లో 2256 పులులు ఉండేవి. ఈ లెక్కన చూసుకుంటే దేశంలో పులుల సంఖ్య పెరుగుతున్నది.
సంరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయెన్స్: టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్(ప్రాజెక్ట్ టైగర్) 50వ వార్షికోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయెన్స్
(ఐబీసీఏ)ను 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పులి, సింహం, చిరుతపులి, స్నో లెపర్డ్, జాగ్వర్, ప్యూమా, చీతా వంటి ప్రపంచంలోని ఏడు ప్రధాన పిల్లుల జాతికి చెందిన వీటిని సంరక్షించాలని ఈ కూటమి లక్ష్యంగా పెట్టుకున్నది.
ఫారెస్ట్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972: దేశంలోని పులులను సంరక్షించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.
ప్రాజెక్ట్ టైగర్: దేశంలోని పులులను రక్షించి వాటి జనాభా పెంపొందించేందుకు భారత ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్‌ను జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చేపట్టింది. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. ప్రపంచంలోనే అతి పెద్దదైన పులుల సంరక్షణ ప్రాజెక్టుగా నిలిచింది.
మోటో: ఇండియా లీడ్స్ టైగర్ కన్జర్వేషన్
పులుల గణన: నేషనల్ టైగర్ కన్జర్వేషన్అథారిటీ(ఎన్ టీసీఏ), వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ)లు, రాష్ట్రాల అటవీ ఏజెన్సీలు, పరిరక్షణ ఎన్జీఓల సహాయంతో భారతదేశంలో పులుల జనాభాను ప్రతి నాలుగేండ్లకు ఒకసారి లెక్కిస్తుంది.
ఎం–ఎస్ టీఆర్ఐపీఈఎస్ సాఫ్ట్వేర్
ఎం-ఎస్ టీఆర్ఐపీఈఎస్ అనే సాఫ్ట్ వేర్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వుల్లో ప్రవేశపెట్టారు. అటవీ అధికారులకు పులులను సంరక్షించడంలోనూ పర్యవేక్షించడంలోనూ ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది.
పులుల సంరక్షణపై సెయింట్ పీటర్స్ బర్గ్ ప్రకటన
2010లో పీటర్స్ బర్గ్ టైగర్ సమ్మిట్ సందర్భంగా పులులకు నిలయంగా ఉన్న భారతదేశంతో సహా 13 దేశాల నాయకులు ప్రపంచవ్యాప్తంగా పులులను రక్షించడానికి, వాటి జనాభాను రెట్టింపు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు.
ALSO READ | Success: హెచ్‌సీయూతో బయోఫ్యాక్టర్ ఒప్పందం