బురఖా తీయించి ఓటర్లను చెక్ చేసిన మాధవీలత

బురఖా తీయించి ఓటర్లను చెక్ చేసిన మాధవీలత
  •     మజ్లిస్ నేతలు రిగ్గింగ్​కు పాల్పడుతున్నారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పాతబస్తీలోని పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ అభ్యర్థి మాధవీలత పర్యటించారు. బురఖాలు తీయించి ముస్లిం మహిళా ఓటర్లను చెక్  చేశారు. ముస్లిం మహిళలు కచ్చితంగా బురఖా తీసే ఓటు వేయాలని ఆమె పట్టుబట్టారు. అప్పుడే ఎవరు ఓటు వేస్తున్నారో తెలుస్తుందని పోలింగ్ ఏజెంట్లకు జెప్పారు. పాతబస్తీలో ఈసారి అక్రమ ఓటింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. 

పాతబస్తీలో పోలింగ్ బూత్​ నంబర్ 40లో మజ్లిస్  నేతలు తలుపులు మూసుకుని రిగ్గింగ్​కు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కాసేపు ఆమె అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. మాధవీలత తీరుపై మజ్లిస్ నేతలు ఫైర్ అయ్యారు. ముస్లిం మహిళలతో ఆమె అసభ్యంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒవైసీ ఎదురుపడడంతో ఉద్రిక్తత..

ఓటింగ్  సందర్భంగా పాతబస్తీలో మజ్లిస్  అభ్యర్థి అసదుద్దీన్  ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత పర్యటించారు. పలు పోలింగ్  కేంద్రాలను సందర్శించే సమయంలో వారిద్దరూ చార్మినార్ సమీపంలో ఒకరికొకరు ఎదురయ్యారు. ఆ సందర్భంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మజ్లిస్  మద్దతుదారులు మాధవీలతపై ఆగ్రహంతో రెచ్చిపోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు వెంట పరుగులు తీస్తూ గందరగోళం సృష్టించారు. 

వెంటనే భద్రతా రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చార్మినార్  సమీపంలో మాధవీలత కారు దిగి ఎవ్వరికీ భయపడేది లేదని పేర్కొన్నారు. కాగా,  మాధవీలతపై మలక్‌‌పేట్‌‌ పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదైంది. ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళ హిజాబ్​ను తీసి పరిశీలించినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.