గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరంపై..ఇప్పుడు నోరు విప్పరేం? : భట్టి విక్రమార్క

  •     కేసీఆర్​కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్న
  •     భట్టి ప్రచారానికి ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వలీ సంఘీభావం

మధిర/బోనకలు, వెలుగు : ప్రపంచంలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అద్భుతంగా నిర్మించామని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్  ఇప్పుడు కుంగిపోతే  ఎందుకు మాట్లాడటం లేదని సీఎల్పీ నేత , మధిర కాంగ్రెస్​ అభ్యర్థి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఆదివారం మధిర నియోజకవర్గం బోనకల్ మండలం సీతాపురం, పెద్ద వీరవెల్లి, జానకిపురం, చిన్న బీరవెల్లి, నారాయణపురం, రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాల్లో ఆయన  ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ హాజరై సంఘీభావం ప్రకటించారు.

రాష్ట్ర ప్రతిపక్ష నేతగా, ప్రజల గొంతుకగా కేసీఆర్ గుండెల్లో వణుకు పుట్టించిన భట్టిని మరోసారి గెలిపించుకోవాలని వలీ ప్రజలకు పిలుపునిచ్చారు. భట్టి మాట్లాడుతూకాళేశ్వరం నిర్మాణం పేరిట లక్ష కోట్లు చేసిన దోపిడీని అధికారంలోకి రాగానే కక్కిస్తామన్నారు. మేడిగడ్డ మాదిరిగానే అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని, నీళ్లను నింపడానికి ఆ ప్రాజెక్టులు పనికిరావని జాతీయ సేఫ్టీ అధికారులు తేల్చి చెప్పారన్నారు.  దానిపై విచారణకు కేసీఆర్ ఎందుకు సిద్ధం కావడం లేదని నిలదీశారు. మిషన్ భగీరథ పేరిట బీఆర్ఎస్ పాలకులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ పథకం కోసం ఖర్చు చేసిన 50 వేల కోట్లు బీఆర్ఎస్ పాలకుల జేబుల్లోకి వెళ్లాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్​ అందించిన సంక్షేమ పథకాలకు  బీఆర్ఎస్ ప్రభుత్వం కోత పెట్టిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లను ఎత్తివేసిన దుర్మార్గపు ప్రభుత్వం బీఆర్​ఎస్​ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పదేండ్లుగా అల్లాడిపోయారన్నారు. కాంగ్రెస్ ను గెలిపించుకుంటే తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.  ప్రజల సంపద ప్రజలకే పంచాలన్నదే తమ ధ్యేయమన్నారు.