మధిర నియోజవర్గం అనాథ అయ్యింది..ఎంపీ నామ నాగేశ్వరరావు

ముదిగొండ, వెలుగు:- మధిర నియోజకవర్గం రెండుసార్లు కాంగ్రెస్ ను గెలిపించుకొని అనాథ అయిందని ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మండల పరిధిలో వెంకటాపురం గ్రామంలో జిల్లా పరిషత్, ఎంపీ నిధులు రూ. 15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ కల్వర్టుకు జడ్పీ చైర్మన్ లింగాల కనమరాజ్ తో కలిసి ఎంపీ నామా శుక్రవారం  శంకుస్థాపన చేశారు. అనంతరం గంధసిరి గురూజీ పస్తం సహదేవ రాజు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ గురూజీ రచ్చబండ, బేడ (బుడ్గ) జంగం ప్రస్థానం ప్రారంభోత్సవ సభలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ  మధిర నియోజకవర్గంలో కొందరూ ధన బలంతో ఎన్నికలవేళ రోడ్లెక్కారని అలాంటివారికి ప్రజల బుద్ధి చెబుతారన్నారు.

 సొంత నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడో పాదయాత్ర చేస్తున్నారని అటు నుంచి అటే వారిని పంపించాలన్నారు.    కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గవెంకట్, ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండస్వామి, రైతు సమితి మండల కన్వీనర్ పోట్ల ప్రసాద్,  బొమ్మ రామ్మూర్తి,  సర్పంచ్ కోటి అనంతరాములు, పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, నాయకులు బంక మల్లయ్య, చెరుకుపల్లి బిక్షం కొత్తపల్లి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.