నిరుద్యోగులపై బీఆర్‌‌‌‌ఎస్‌‌ మొసలి కన్నీళ్లు... మధు యాష్కీ

నిరుద్యోగులపై బీఆర్‌‌‌‌ఎస్‌‌ మొసలి కన్నీళ్లు... మధు యాష్కీ
  • పదేండ్లు వాళ్లు ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలి

హైదరాబాద్, వెలుగు: పదేండ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్‌‌‌‌ఎస్‌‌ నాయకులు.. ఇప్పుడు నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి తర్వాత ఇవ్వడం కుదరదని మాటమార్చిన చరిత్ర కేసీఆర్‌‌‌‌ది అని విమర్శించారు. శనివారం ఆయన తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి వారి బలిదానాలకు కేసీఆర్, హరీశ్‌‌ రావు, కేటీఆర్ కారణమయ్యారని, ఇప్పుడు కూడా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారన్నారు. బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ రాజకీయ ఉనికి కోసం యువతను మరోసారి బలి చేస్తారా అని నిలదీశారు. కేసీఆర్ తన పదేండ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రధాని మోదీ.. నిరుద్యోగులను నిండా మోసం చేశారని ఆరోపించారు.

ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్‌‌ను ప్రశ్నించే హక్కు బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌కు లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్లను ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 28,942 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశామని చెప్పారు. నిరుద్యోగ యువత బీఆర్ఎస్ ఉచ్చులో పడొద్దని కోరారు.