హైదరాబాద్, వెలుగు: కేటీఆర్‌లా రాజభోగాలు అనుభవించేందుకు తనకు ఫామ్ హౌస్ లేదని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. తనకు ఫామ్ హౌస్ ఉంటే చూపించాలని కేటీఆర్‌ను శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘‘నాకు ఫామ్ హౌస్ ఉందని.. అది ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నట్లు కేటీఆర్ ఇటీవల తరుచూ తన పేరును ప్రస్తావిస్తున్నారు. నా ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో, అది ఎంత విలాసంగా నిర్మించుకున్నానో కేటీఆరే చూపించాలని డిమాండ్ చేస్తున్నా’’ అని మధుయాష్కీ మండిపడ్డారు.అబద్ధాలు, చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని కేటీఆర్‌కు సూచించారు.
‘‘వారానికి నాలుగు సార్లు వెళ్లి ఎంజాయ్ చేయడానికి నీకు(కేటీఆర్) జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది.111 జీవోకు విరుద్ధంగా దాన్ని నిర్మించారు. పైగా బినామీ పేర్లతో మెయింటెన్ చేస్తున్నవు. నీలాగా నాకు అలా విలాసవంతమైన ఫామ్ హౌస్‌లు లేవు. నేను ప్రజల్లో ఉండేటోన్ని.అందరిలా సాధారణ జీవితాన్ని గడిపే వాడిని’’ అని వివరించారు. తమకు గండిపేట దగ్గర మామిడి తోట, సపోటా తోట ఉన్న మాట వాస్తవమని చెప్పారు. అక్కడ తమ వాచ్ మెన్ కుటుంబం కోసం చిన్న నిర్మాణం చేశామని..అక్కడ ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు.