మాది అక్రమ సంబంధం కాదు.. శ్రీనివాస్ నన్ను ఆదుకున్నారు: మాధురి

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ కుటుంబ కథా చిత్రంలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్‌ను తాను డబ్బు కోసం ట్రాప్ చేశారని కుమార్తెలు చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆయనతో కలిసి ఉంటోన్న దివ్వల మాధురి తెలిపింది. శ్రీనివాస్ బ్యాంకు బ్యాలెన్స్ జీరో అన్న ఆమె, ఉన్న ఆస్తులు మొత్తం ఆయన భార్యా పిల్లలకే ఇచ్చేశారని వెల్లడించింది. శ్రీనివాస్ ఎన్నికల కోసం తాను రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశానని చెప్పుకొచ్చింది.

మీడియా ముందుకొచ్చి తండ్రీ.. తండ్రీ అంటున్న శ్రీనివాస్ పిల్లలు ఈ రెండేళ్లు ఏమైపోయారని మాధురి ప్రశ్నించింది. కష్టకాలంలో శ్రీనివాస్ రోడ్డుపై ఉన్నప్పుడు  పిల్లలు ఎటుపోయారని ప్రశ్నల వర్షం కురిపించింది. కుమార్తెల తల్లి దువ్వాడ వాణి.. శ్రీనివాస్‌ను ఇంట్లోకి రానీయకపోతే తాను ఉంచుకోవాల్సి వచ్చిందని తెలిపింది. తమ బంధం అక్రమ సంబంధం కాదన్న ఆమె.. ఇద్దరూ ఇష్టపూర్వకంగా కలిసి ఉంటున్నట్లు వెల్లడించింది. ఓ ఫ్రెండ్‌లా, కేర్‌టేకర్‌లా శ్రీనివాస్ తో కలిసి ఉంటున్నాని పేర్కొంది. అందుకు సహజీవనంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరణగా పేర్కొంది. 

దువ్వాడ వాణి తన స్వార్థం కోసం తనపై నిందలు వేశారని, తన వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీశారని మాధురి చెప్పుకొచ్చింది. ఆ బాధతో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు.. దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా నిలిచారని తెలిపింది. తనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారన్న ఆమె.. ఈ వార్తలతో వారి భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించింది. ఇలాంటి ఆరోపణల కారణంగా తాను కుటుంబానికి, భర్తకు దూరమైపోయాయని వాపోయింది. తనపై పడిన మచ్చ ఎప్పటికీ పోదన్న ఆమె.. మున్ముందు దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.

చివరగా దువ్వాడ శ్రీనివాస్‌కు, వాణికి మధ్య ఏమైనా విబేధాలు ఉంటే, కూర్చొని మాట్లాడుకోవాలని హితవు పలికింది. అనవసరంగా తనను లాగొద్దని హెచ్చరించింది. తేలకుంటే కోర్టుకు వెళ్లాలని సూచించింది.

కాగా, తమ తండ్రిని కలవనివ్వాలంటూ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు హైందవి, నవీన గురువారం(ఆగష్టు 07) ఆయన ఇంటి వద్ద బైఠాయించారు. కనిపెంచిన తండ్రి తమను కలవకుండా దివ్వల మాధురి అడ్డుకుంటోందని వారు ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మాధురి మీడియా ముందుకొచ్చింది.