మదర్‌‌‌‌ డెయిరీ చైర్మన్‌‌‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మధుసూదన్‌‌‌‌రెడ్డి

మదర్‌‌‌‌ డెయిరీ చైర్మన్‌‌‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మధుసూదన్‌‌‌‌రెడ్డి

నల్గొండ, వెలుగు: మదర్‌‌‌‌ డెయిరీ చైర్మన్‌‌‌‌గా ఆలేరు డైరెక్టర్‌‌‌‌ గుడిపాటి మధుసూదన్‌‌‌‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హయత్‌‌‌‌నగర్‌‌‌‌లోని మదర్‌‌‌‌ డెయిరీ ఆఫీస్‌‌‌‌లో శనివారం చైర్మన్‌‌‌‌ ఎన్నిక నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న 9 మంది డైరెక్టర్లతో పాటు కొత్తగా ఎన్నికైన వారు కలిసి చైర్మన్‌‌‌‌గా మధుసూదన్‌‌‌‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మధుసూదన్‌‌‌‌రెడ్డికి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి సమక్షంలో నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి, మాజీ చైర్మన్‌‌‌‌ గుత్తా జితేందర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. 

ముగ్గురు డైరెక్టర్లకు ఐదేళ్లు, మరో ముగ్గురికి నాలుగేళ్ల పదవీకాలం

చైర్మన్‌‌‌‌ ఎన్నికకు ముందు కొత్తగా ఎన్నికైన ఆరుగురు డైరెక్టర్ల పదవీకాలం నిర్ధారించేందుకు ఎన్నికల అధికారి వెంకట్‌‌‌‌రెడ్డి డ్రా తీశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు డైరెక్టర్లు గుడిపాటి మధుసూదన్‌‌‌‌రెడ్డి, బత్తుల నరేందర్‌‌‌‌రెడ్డి, అగ్రాల నర్సింహారెడ్డి పదవీ కాలం ఐదేళ్లుగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన కల్లెపల్లి శ్రీశైలం, పుప్పాల నర్సింహులు, మండలి జంగయ్య పదవీ కాలం నాలుగేళ్లుగా నిర్ధారణ అయింది.

డెయిరీని లాభాల బాటలో నడిపించాలి

మదర్‌‌‌‌ డెయిరీ చైర్మన్‌‌‌‌ ఎన్నిక అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. నష్టాల్లో ఉన్న డెయిరీని లాభాల బాటలో నడిపించాలని, వృథా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న పాల బిల్లులు చెల్లించడంతో పాటు, డెయిరీని అభివృద్ధి పథం నడపాలని చెప్పారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డితో మాట్లాడి పాడి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.