స్కూల్ బస్సు మిస్ కావడంతో సమయానికి క్లాసుకు హాజరు కాలేనన్న భయంతో ఓ తొమ్మిదో తరగతి స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటి వెనుక ఉన్న మామిడి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన సోమవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని బైతూల్ జిల్లా ఆందోహ్ గ్రామంలో జరిగింది. చదువులో మెరిట్ ఉండే ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, టీచర్లు తీవ్ర విషాదంలో ముగినిపోయారు.
అందోహ్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల పిల్లాడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆ స్టూడెంట్ ప్రతి రోజూ టైమ్ స్కూల్‌కు వెళ్లేవాడు. కానీ సోమవారం ఉదయం స్కూల్ బస్ కామన్ పికప్ పాయింట్ వద్దకు ఆ పిల్లాడు చేరుకునే సమయానికి బస్ వెళ్లిపోయింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఇంటి వెనుక ఉన్న మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ బస్సు ఎక్కడం కోసం ఇంటి నుంచి వెళ్లిన ఆ పిల్లాడు.. బస్సు మిస్ కావడంతో ఇంటికి వెళ్లాడని, కొన్ని నిమిషాల తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఘడదోంగ్రీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ రవి శక్య తెలిపారు. స్కూల్ బస్సు మిస్ కావడంతో ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడని, ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడని ఊహించలేదని ఆ పిల్లాడి అంకుల్ చెప్పాడు. ఆ బాలుడు తొమ్మిదో తరగతి పిల్లలందరిలోనూ మెరిట్ ఉండేవాడని, రోజూ టైమ్‌కు స్కూల్‌కు వచ్చే వాడని, ఒక్క రోజు బస్ మిస్ కావడంతో ఇలా చేయడం తట్టుకోలేపోతున్నామని టీచర్లు అన్నారు.