మధ్యప్రదేశ్ లో బుధవారం ఒక్క రోజే 20 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అందులో 19 మంది ఇండోర్, ఒకరు ఖర్గోన్ జిల్లాలకు చెందిన వారని చెప్పారు. ఇండోర్ లో 19 మంది పేషెంట్లలో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన వాళ్లని, అందులో ముగ్గురు చిన్నారులు (3, 5, 8 ఏళ్ల వయసు) ఉన్నారని వివరించారు. ఇవాళ కొత్తగా వచ్చిన కేసులతో కలిపి మధ్యప్రదేశ్ లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 86కి చేరింది. ఇందులో ఒక్క ఇండోర్ లోనే 63 కరోనా కేసులు నమోదయ్యాయి. జబల్పూర్ లో 8, ఉజ్జయినిలో 6, భోపాల్ లో 4, శివపురి, గ్వాలియర్ లలో రెండు చొప్పున, ఖర్గోన్ జిల్లాలో ఒక కరోనా కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఒక పోలీస్ అధికారికి కరోనా
ఇండోర్ లో కరోనా పాజిటివ్ వచ్చిన 19 మందిలో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారని ఏఎస్పీ గురు ప్రసాద్ పరాశర్ చెప్పారు. ఆ పోలీస్ అధికారికి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని తెలిపారు. ముందు జాగ్రత్తగా ఆ పోలీస్ అధికారి భార్య, ఇద్దరు కుమార్తెలను ఆస్పత్రికి తరలించి క్వారంటైన్ చేసినట్లు చెప్పారు. ఆయన డ్యూటీలో ఉన్న పోలీస్ స్టేషన్ ను శానిటైజ్ చేశామని, అక్కడ పని చేస్తున్న మిగతా స్టాఫ్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు పరాశర్.