భోపాల్/హర్దా: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో 174 మందికి కాలిన గాయాలయ్యాయి. హర్దా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బైరాగఢ్ గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో గన్ పౌడర్‌ను పెద్ద మొత్తంలో నిల్వ చేయడంతో పేలుడు తీవ్రత పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయని, ఫ్యాక్టరీ చుట్టు పక్కల ఉన్న 50 ఇండ్లకూ మంటలు అంటుకున్నాయని తెలిపారు.
పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు పట్ల మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తంచేశారు. ‘‘హర్దా ప్రమాదంలో కొందరు సజీవ దహనం కావడం మనసును కలచివేస్తోంది. నేను ఈ రోజు ఛింద్వారా జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ప్రమాద ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటం” అని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు.
రూ. 4 లక్షల చొప్పున పరిహారం..
ఫ్యాక్టరీ వద్ద మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని హర్దా జిల్లా కలెక్టర్ రిషి గార్గ్ తెలిపారు. పొరుగు జిల్లాల నుంచి ఫైర్ ఇంజన్లను, అంబులెన్స్ లను రప్పించినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే సీఎం మోహన్ యాదవ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. బాధితులను తరలించేందుకు హెలికాప్టర్లను పంపాలంటూ ఆర్మీ ఉన్నతాధికారులను సంప్రదించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
మృతులకు రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
హర్దా ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కూడా మృతులకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. క్రాకర్స్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. ‘‘ప్రమాదంలో పలువురు సజీవ దహనం కావడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. బాధితులకు స్థానిక అధికారులు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలి. ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడినవారికి రూ. 50 వేల పరిహారం అందజేస్తాం” అని ప్రధాని ప్రకటన చేసినట్లు పీఎంవో ట్విట్టర్లో వెల్లడించింది.
25 కి.మీ. దూరం వినిపించిన శబ్దాలు..
క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుళ్ల ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిడపడుతుండగా.. వరుసగా పెద్ద పెద్ద శబ్దాలతో పేలుళ్లు జరగడం.. ప్రజలు ప్రాణభయంతో పారిపోతుండటం వీడియోల్లో కనిపించింది. పేలుడు ధాటికి కొంతమంది శరీర భాగాలు తెగిపోయి ఎగిరిపడ్డాయని అక్కడి వారు మాట్లాడుకోవడం కూడా వినిపించింది. ఫ్యాక్టరీ నుంచి ఎగిసిపడిన వస్తువులు రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడ్డాయని సాక్షులు తెలిపారు.
పేలుళ్ల శబ్దాలు దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించాయని పలువురు చెప్పారు. తన ఎనిమిదేండ్ల కొడుకు తన కోసం టిఫిన్ బాక్స్ తీసుకుని ఫ్యాక్టరీకి వచ్చాడని.. అదే సమయంలో పేలుడు జరిగిందని రాజు అనే కార్మికుడు చెప్పాడు. తన కొడుకు గణేశ్ తన కంటే ముందే పరుగెత్తుకుంటూ వెళ్లాడని, కానీ అతడి ఆచూకీ దొరకడంలేదని కన్నీటి పర్యంతం అయ్యాడు. సంఘటన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది పని చేస్తున్నారని, ప్రమాదం జరిగిన వెంటనే అందరూ వీలైన దిక్కుకు పరుగెత్తారన్నాడు.
Also Read :ఏపీ నీళ్ల దోపిడీ పై వెలుగు కథనాల టైమ్‌లైన్