దేశ విద్యారంగానికి ఇవాళ చాలా ముఖ్యమైన రోజన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా.. మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న షా.. హిందీలో ఎంబీబీఎస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీంతో హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. దేశంలో తొలిసారి హిందీ లో వైద్యవిద్యను ప్రారంభించడం ద్వారా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మోడీ కలను నెరవేర్చిందన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే మధ్యప్రదేశ్ లో హిందీలో మెడిసిన్ విద్య అందుబాటులోకి వస్తుందన్నారు అమిత్ షా.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని రాజమాత విజయరాజే సింధియా విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనం, విస్తరణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. కొత్త టెర్మినల్ భవనాన్ని రూ. 446 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.