మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ ఆరోపణలు
భోపాల్: మధ్యప్రదేశ్లో అధికార కాంగ్రెస్పార్టీ సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా 8 నుంచి12 మంది ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసిందని ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. అసెంబ్లీలో క్రిమినల్లా (మధ్యప్రదేశ్అమెండ్మెంట్) బిల్లు, 2019పై ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్ఎమ్మెల్యేలు గైర్హాజరు అయినా, సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్నట్లు చూపేందుకు ముఖ్యమంత్రి కమల్నాథ్ ప్రభుత్వం వాళ్ల సంతకాలను ఫోర్జరీ చేసిందని ఆదివారం ప్రతిపక్ష నేత గోపాల్భార్గవ ఆరోపించారు. క్రిమినల్ లా(మధ్యప్రదేశ్అమెండ్మెంట్) బిల్లు, 2019పై బుధవారం ఓటింగ్నిర్వహించగా, ప్రభుత్వానికి అనుకూలంగా 122 ఓట్లు పడ్డాయి.
ప్రతిపక్ష బీజేపీ సభ్యులు శరద్కోల్, నారాయణ్ త్రిపాఠి కూడా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. అయితే, ఆ రోజు సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 8 నుంచి12 మంది గైర్హాజరయ్యారని, అలాంటప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఇన్ని ఓట్లు ఎలా వస్తాయని గోపాల్ భార్గవ ప్రశ్నించారు. మొత్తం 230 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్కు 114 ఎమ్మెల్యేలు ఉన్నారు. నలుగురు ఇండిపెండెంట్లు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
బిల్లుపై ఓటేసిన ఎమ్మెల్యేల సంతకాలను వెరిఫై చేయాలని తాము గవర్నర్ను కోరతామని, ఈ విషయంలో గవర్నర్కు ఉన్న అధికారాల పరిధిని పరిశీలిస్తున్నామని భార్గవ చెప్పారు. ఓటింగ్సమయంలో వీడియో తీయకుండా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అయితే, ఓటింగ్ సమయంలో సభలోనే ఉన్న భార్గవ.. ఈ విషయంపై అప్పుడే ఎందుకు నిలదీయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్యాదవ్ అన్నారు. ఓటింగ్ ప్రక్రియను చెక్ చేసుకుంటే ఆయనను ఎవరూ ఆపేవారు కాదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలే గైర్హాజరయ్యారని, ఆ పార్టీకి అబద్ధాలాడటం అలవాటైపోయిందని ఫైర్ అయ్యారు.