మధ్యప్రదేశ్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. హర్దా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగడంతో వాహనంలో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం అయ్యారు. అతి వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఇంజన్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నూతన వధూవరులతో సహా నలుగురు సజీవ దహనమయ్యారు.
మధ్యప్రదేశ్ లోని వర్కాల చర్డెడ గ్రామానికి చెందిన అఖిలేష్ కుష్వాహా, గోలు చౌదరి, రాకేష్ కుష్వాహ , అతని భార్య శివాని కారులో పెళ్లికి వెళ్లారు. వివాహ వేడుకలకు తిరిగి హాజరై కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మే 31వ తేదీ బుధవారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు తిమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోఖర్ని గ్రామంలో ఒక చెట్టును వేగంగా ఢీకొంది. దీంతో ఆ కారులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో నూతన వధూవరులు రాకేష్ కుష్వాహ,శివానితో పాటు... అఖిలేష్ కుష్వాహా, గోలు చౌదరి బయటకు రాలేకపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో సహా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో మహిళతో సహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారని..వీరిలో పెళ్లైన కొత్త దంపతులు కూడా పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.