ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మతపరమైన, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించారు. లౌడ్ స్పీకర్ల వలన తీవ్రమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దని పేర్కొంది.
కాగా ఈ రోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ మంగూభాయ్ పటేల్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజేంద్ర శుక్లా, జగదీశ్ దేవ్‌రా ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.ఈ ప్రమాణస్వీకార వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్య నాథ్, పుష్కర్ సింగ్ ధామి, ఏక్‌నాథ్ శిందే, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తదితరులు హాజరయ్యారు.
230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 163 స్థానాలు దక్కించుకోగా.. కాంగ్రెస్ 66 స్థానాలకు పరిమితమైంది. మోహన్ యాదవ్ ప్రస్తుతం ఉజ్జయిని సౌత్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.