కమలం స్టయిల్లో కమల్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ‘సాఫ్ట్ హిందూత్వ’ ఆయుధంతో రాష్ట్ర రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. హిందూత్వకు అసలైన చాంపియన్ కాంగ్రెసేనని చాటుతున్నారు. మెజారిటీ వర్గమైన హిందువులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ బీజేపీ లీడర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వందేమాతరం గీతాలాపన వంటి వివాదాన్ని కూడా చాకచక్యంతో అనుకూల అంశంగా మరల్చుకుని సామాన్యు లకు దగ్గరవుతున్నారు.

హిందుత్వపై తమకే పేటెంట్ హక్కులు ఉన్నాయని కొన్నేళ్లుగా మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులు భావిస్తూ వచ్చారు. అయితే అది కేవలం భ్రమే అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తేల్చి చెప్పా రు. మధ్యప్రదేశ్ పరిణామాలను గమనిస్తే హిందూత్వ ఇష్యూపై శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ కంటే కమల్ ప్రభుత్వమే రెండాకులు ఎక్కువ చదివినట్లు కనిపిస్తోంది. సగటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

హిందువులకు దగ్గరయ్యే నిర్ణయాలు
కాంగ్రెస్ అంటే ఒకప్పుడు ముస్లింలను బుజ్జగించే పార్టీ అనే పేరుండేది. ఈ ముద్రను చెరిపేయడానికి మధ్యప్రదేశ్ సర్కార్ చేయాల్సిందంతా చేస్తోంది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు కేవలం ఆరు శాతమే. కమల్ నాథ్ కు ఈ రాజకీయ లెక్కలు కొట్టిన పిండే. అందుకే ముస్లింలకు దూరమైనా పర్లేదు కానీ మెజారిటీ హిందువులకు మాత్రం దగ్గర కావాల్సిందేనన్న ఒక టార్గెట్ పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. గోహత్యతో సంబంధమున్నదన్న ఆరోపణలపై ఈమధ్య ముగ్గురు ముస్లిం యువకులపై ‘జాతీయ భద్రతా చట్టం’ (ఎన్ఎస్ఏ ) ప్రయోగించడాన్ని ఈ కోణంలో నుంచే చూడాలి. ఖాండ్ వా ఎస్పీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్యతో ఆవులను కాపాడే పనికి బీజేపీయే కాదు తాము కూడా కట్టు బడి ఉన్నామని పరోక్షంగా ప్రజలకు సంకేతాలు పంపింది మధ్య ప్రదేశ్ సర్కార్. కమల్ నాథ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు ఎవరూ బహిరంగంగా వ్యతిరేకించలేదు. అయితే సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాత్రం ఆంతరంగిక సమావేశాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి తీవ్ర విమర్శలు చేయకుండా దిగ్విజయ్ గమ్మున ఉన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో లోనే హిందూత్వ అంశాలు
మధ్యప్రదేశ్ లో ఈసారి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ‘సాఫ్ట్ హిందూత్వ’ అనే ఆయుధాన్ని ప్రయోగించింది. తాము అధికారంలోకి వస్తే ఆవుల రక్షణకు టాప్ ప్రయారిటీ ఇస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా 23 వేల గ్రామాల్లో గోశాలల నిర్మాణం చేపడతామని ప్రకటించింది. దీంతో పాటు వనవాసంలో రాముడు ప్రయాణించాడని చెబుతున్న దారికి సంబంధించి ఓ కట్టడం కూడా నిర్మిస్తామని మరో హామీ ఇచ్చింది. ఈ రెండు హామీలతో మెజారిటీ హిందువులను తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదిపి, సక్సెస్ అయింది.

‘మీసా’ ఖైదీలకు పెన్షన్ల కొనసాగింపు
ఎమర్జెన్సీలో అనేక మంది రాజకీయ ప్రత్యర్థులను అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ‘ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నెల్ సెక్యూరిటీ యాక్ట్ ’ ( మీసా) కింద అరెస్టు చేసింది. ఇలా మీసా కింద అరెస్టయిన కాంగ్రెసేతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని బీజేపీ 2008 లో ప్రారంభించింది. దాదాపు రెండు వేల మందికి నెలనెలా ఈ పెన్షన్ అందుతోంది. కమల్ నాథ్ సర్కార్ రాగానే ఈ పెన్షన్లు ఆగిపోతాయని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ పెన్షన్లు కొనసాగించాలని కమల్ నాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సామాన్య ప్రజల్లో గుడ్ విల్ పెరిగింది. ఇదిలా ఉంటే శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ కు, కమల్ నాథ్ ప్రభుత్వానికి పెద్దగా తేడా కనిపించడం లేదని లెఫ్ట్ పార్టీలు విమర్శలు గుప్పించాయి. సమాజ్ వాది పార్టీ ( ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా కమల్ నాథ్ సర్కార్ పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే ఎత్తుగడలు వేయడంలో ఘటికుడిగా పేరున్న కమల్ నాథ్ ఈ విమర్శలను పట్టించుకునే మూడ్ లో లేరు. వజ్రాన్ని వజ్రంతో నే కోయాలన్న సిద్ధాంతాన్ని గట్టిగా ఫాలో అవుతున్నారు.

ఆంటోనీ సిఫార్సులకు పెద్ద పీట
ముస్లింలను బుజ్జగించే పార్టీగా కాంగ్రెస్ కు గతంలో ఇమేజ్ ఉండేది. 2014 లోక్ సభ ఎన్ని కల తరువాత పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ ఇచ్చిన నివేదికలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ కు ఉన్న ఈ ఇమేజ్ వల్ల మెజారిటీ హిందువులు దూరమవుతున్నారని ఆంటోనీ తన నివేదికలో స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలకు దగ్గర కావడం వల్ల కలిగే మేలు కంటే మెజారిటీ హిందువులకు దూరం కావడం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ అని ఆంటోనీ నివేదిక తెగేసి చెప్పింది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం హిందువులకు దూరం కావడమేనని కుండబద్దలు కొట్టింది. ఎన్నికల్లో గెలవాలంటే మెజారిటీ వర్గానికి దగ్గర కావడం తప్ప మరో దారిలేదని తెగేసి చెప్పింది. ఆంటోనీ నివేదిక చేసిన సిఫార్సులను కొన్నేళ్లుగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అమలు చేస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ తొలిసారిగా గుళ్లు గోపురాలను దర్శించడం మొదలెట్టి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. రాహుల్ ఆలయాలకు వెళ్లడాన్ని బీజేపీ నేతలు ఓవివాదం చేశారు. దీనికి కాంగ్రెస్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. చివరకు రాహుల్ ను జంధ్యం వేసుకున్న బ్రాహ్మణుడిగా కాంగ్రెస్ ప్రకటించి వివాదానికి తెరదించింది.