సీఎం పదవి అంటే మామూలు గా ఉండదు. గొప్ప వ్యక్తులతో బిజీ బిజీగా గడుపుతారు. ప్రధాని, కేంద్రమంత్రులు..ఇతర వీఐపీలతో భోజనాలు చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం ఓ దొంగతో భోజనం చేశారు. దొంగను తన పక్కనే కూర్చోపెట్టుకుని అతనితో కలిసి తిన్నారు.
వివరాల్లోకి వెళ్తే
ఏప్రిల్ 17వ తేదీన మధ్య ప్రదేశ్ రాష్ట్రం సిద్ది జిల్లాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ పర్యటించారు. ఓ కార్యక్రమంలో సామాన్యులతో కలిసి విందులో పాల్గొన్నారు. ఆ సమయంలోనే భద్రత సిబ్బంది కళ్లుగప్పి అరవింద్ గుప్తా అనే దొంగ అక్కడికి వచ్చాడు. అంతేకాదు సీఎం పక్కనే కూర్చోని భోజనం చేశాడు. అయితే తన దగ్గరకు వచ్చిన వ్యక్తి కలప దొంగ అని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కు తెలియదు. సాధారణ వ్యక్తే అని భావించిన శివరాజ్ సింగ్ చౌహాన్..భోజనం మధ్యలో దొంగ వీపును తట్టారు.
జైలుకెళ్లి వచ్చాడు..
అరవింద్ గుప్తా ఏప్రిల్ 10న కలప దొంగతనం కేసులో జైలుకెళ్లాడు. రెండు రోజుల పాట జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్పై వచ్చాడు. అరవింద్ గుప్తాపై అటవీ చట్టం 1927లోని సెక్షన్లు 2, 26, 52 ప్రకారం..చోరీ, స్మగ్లింగ్ కేసులు నమోదు చేశారు. మరోవైపు సీఎం పక్కన దొంగ కూర్చోని భోజనం చేయడం విమర్శలకు దారితీసింది.