దేశంలో కరోనా ఉధృతికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సోకి మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా జోబట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కళావతి భూరియా చనిపోయారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆమె ఇండోర్‌లోని షాల్బీ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 12 రోజుల తర్వాత ఇవాళ (శనివారం) ఆమె మృతి చెందారు.
కరోనా బారిన పడిన కళావతి ఆస్పత్రిలో చేరిన నాటికి ఆమె ఊపరితిత్తులు 70 శాతం వరకూ పాడయ్యాయని..ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోయాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించామని.. అయినా ఫలితం లేక పోయిందని ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.
2018లో జోబాట్ నియోజకవర్గం నుంచి కళావతి భూరియా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భూరియాకి కళావతి మేనకోడలు. ఎమ్మెల్యే మరణంపై కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ చీఫ్ కమల్‌నాథ్ సంతాపం వ్యక్తం చేశారు.