మధ్యప్రదేశ్‌లో రాజకీయ దుమారం.. హోటల్లో ఎమ్మెల్యేలు
10 మందిని బీజేపీ తీసుకెళ్లిందన్న కాంగ్రెస్
కమల్‌నాథ్ సర్కార్‌కు షాక్
ఆరుగురిని వెనక్కి తీసుకొచ్చినం.. మిగిలినోళ్లూ వస్తరు: దిగ్విజయ్
మాకేం సంబంధం లేదు: బీజేపీ
కాంగ్రెస్ పార్టీ సొంత గొడవని కామెంట్
ఇండోర్/గురుగ్రామ్/భోపాల్: మధ్యప్రదేశ్ పాలిటిక్స్‌లో మంగళవారం రాత్రి అలజడి రేగింది. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ.. హర్యానాలోని గురుగ్రామ్‌కు తరలించిందని కాంగ్రెస్ ఆరోపించింది. డబ్బు, అధికారాన్ని ఉపయోగించి తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడింది. మరోవైపు వ్యాపమ్ కేసును వెలుగులోకి తెచ్చిన ఆనంద్ రాయ్ సంచలన వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు, మంత్రి పదవులను బీజేపీ నేత సరోత్తం మిశ్రా ఆఫర్ చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ‘హార్స్ ట్రేడింగ్: బీజేపీ ఎక్స్పోస్డ్’ పేరుతో స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేశారు. బీజేపీ మాత్రం ఆ వీడియో ఫేక్ అని కొట్టిపారేసింది.
10 మంది ఎమ్మెల్యేలు..
మొత్తం 10 లేదా 11 మంది ఎమ్మెల్యేలను బీజేపీ హర్యానాకు తరలించిందని వార్తలు వచ్చాయి. దీంతో గురుగ్రామ్‌లోని హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసేందుకు దిగ్విజయ్ సింగ్, ఆయన కొడుకు జైవర్ధన్ సింగ్, మరికొందరు వెళ్లారు. ఎమ్మెల్యేలను కలవకుండా మంత్రులను అక్కడ అడ్డుకున్నారని వారు చెప్పారు. బుధవారం ఆరుగురిని వెనక్కి రప్పించామని దిగ్విజయ్ చెప్పారు. మిగతా వారితో కూడా టచ్‌లో ఉన్నామని, వారు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మధ్యప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ తరుణ్ బానోత్తోపాటు కొంతమంది కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ ఎమ్మెల్యేలు స్పెషల్ ఫ్లయిట్లో బుధవారం భోపాల్ చేరుకున్నారు. అయితే ఎంతమంది వచ్చారో కచ్చితంగా తెలియదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.
బ్లాక్ మనీతో కూల్చాలని చూస్తున్నరు
‘‘బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత.. బీఎస్పీ ఎమ్మెల్యేను చార్టర్డ్ ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకెళ్లాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది” అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.‘‘పెద్ద నోట్ల రద్దు తర్వాత బీజేపీ పెట్టెలు బ్లాక్ మనీతో నిండిపోయాయి. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ బ్లాక్ మనీని ఉపయోగిస్తున్నారు. గుజరాత్, కర్నాటక, గోవా, మణిపూర్ లేదా మేఘాలయ ఎక్కడైనా చూడండి” అని కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ శక్తి సిన్హా గోహిల్ ఆరోపించారు. ‘‘ఇద్దరు వ్యక్తుల ఆర్డర్లతోనే వాళ్లు ఇదంతా చేస్తున్నారు. కానీ మధ్య ప్రదేశ్‌లో వాళ్లు గెలవలేరు” అని అన్నారు.
మేం ఏం చేయలే: బీజేపీ
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తాము ఏమీ చేయడం లేదని బీజేపీ స్పష్టం చేసింది. తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఎంపీ బీజేపీ చీఫ్ వీడీ శర్మ చెప్పారు. రాష్ర్టంలో ఉన్నది బ్లాక్మెయిల్ ప్రభుత్వం అని ఆరోపించారు. కాంగ్రెస్‌లో అంతర్గత గొడవ జరుగుతోందని, దానికి కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాధిత్య సింధియానే సమాధానం చెప్పాలని
అన్నారు.
ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
మధ్యప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ 114 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. విప్‌ను ఉల్లంఘిస్తే.. సభ్యత్వం గంటలోనే రద్దు అవుతుందని మంత్రి గోవింద్ సింగ్ హెచ్చరించారు. క్రాస్ ఓటింగ్‌ను సహించబోమని స్పష్టం చేశారు.
అంతా కంట్రోల్లో ఉంది
అంతా కంట్రోల్ లోనే ఉంది. అలాంటిదేం జరగదు. ఎమ్మెల్యేలు తిరిగి వస్తారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామంటూ ఆఫర్లు
వస్తున్నాయని మా ఎమ్మెల్యేలు చెప్పారు. ఉచితంగా డబ్బులు వస్తే తీసుకోమని నేను చెప్పా.
– ఎంపీ సీఎం కమల్‌నాథ్
మీకు చేతకాక..
తమ ఎమ్మెల్యేలను మేనేజ్ చేసుకోలేక కాంగ్రెస్.. మాపై ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చే చర్యలు చేయడం లేదని మొదటి నుంచి చెబుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తనంతట తాను కూలిపోతే.. దానికి బాధ్యత వాళ్లదే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది వారి సొంత విషయం. ఆరోపణలు మాత్రం మాపై చేస్తున్నారు. నేను బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌ను.. పార్టీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఢిల్లీకి వెళ్తా. ఇందులో దిగ్విజయ్ సింగ్‌కు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి?
– బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్