సెప్టెంబర్ 17ను గత ప్రభుత్వాలు అధికారికంగా జరపలేకపోయాయని మధ్యప్రదేశ్ ఎన్నికల ఇంఛార్జి మురళీధర్ రావు అన్నారు. ఇది పోరాటం పట్ల, పోరాట వీరుల పట్ల, త్యాగం, బలిదానం చేసిన అమరవీరుల పట్ల నిర్లక్ష్యమే కాదు, అవమానకరమన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ఎన్నికల ఇంఛార్జి మురళీధర్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండ్రాంపల్లి విశిష్టతను తెలియజేస్తూ... జాతీయవాద ఉద్యమాలకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశ పెత్తందారీ వ్యవస్థ కు ఎదురొడ్డి పోరాడిన కేంద్రాలలో గుండ్రాంపల్లి ప్రముఖమైనదన్నారు. గతంలో అమిత్ షా ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా సందర్శించి ఇక్కడ అమరులైన కుటుంబాలకు నివాళులు అర్పించారని, నిజాం శాసనాలపై చర్చ వ్యతిరేకంగా, విలీనం కోసం తెలంగాణ వ్యాప్తంగా పోరాటం జరిగిందని చెప్పారు. సర్ధార్ పటేల్ పుణ్యమా అని ఆపరేషన్ పోలో పేరు మీద సైనిక చర్య ద్వారా భారత దేశంలో విలీనం జరిగిందన్న మురళీధర్ రావు... ఇంత ఉజ్వల చరిత్ర కలిగిన పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని విమర్శించారు.
టీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఏవిధంగా ఐతే కాంగ్రెస్, ఎంఐఎంకు కీలుబొమ్మలుగా ఉందో అదే పద్ధతిని టీఆర్ఎస్ పార్టీ కొనసాగించడం దురదుష్టకరమని మురళీధర్ రావు అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంకి లొంగిపోయి రాజాకర్ల వారసత్వంగా రాజకీయాలకు కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. టీఆర్ఎస్ సెప్టెంబర్ 17ను గత 8 సంవత్సరాలుగా అధికారికంగా జరపలేదన్న ఆయన... రేపు బీజేపీ పార్టీ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరపున అమరవీరులకు నివాళులు అర్పిస్తామని చెప్పారు. కేవలం ప్రతిష్ట పోతుందని విధిలేని పరిస్థితులలో ఒక స్వతంత్ర కార్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమరవీరులను, పోరాట యోధులను గౌరవించాలని, గుండ్రాంపల్లి వంటి గ్రామం వచ్చే తరానికి ప్రేరణ కేంద్రంగా నిలవాలన్నారు. గుండ్రాంపల్లిలో కాశీ రజ్వీ, మాగ్బుల్ ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన యువకులను సజీవంగా బావిలో పడేసి కాల్చిన చరిత్ర అని గుర్తు చేశారు. బీజేపీ పార్టీ తరపున సువర్ణాక్షరాలతో రాయవలసిన గుండ్రాంపల్లి చరిత్ర కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్నామన్నారు. రేపు తెలంగాణ ప్రజలు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మన స్వతంత్ర పోరాటం, మన ఉనికి మన అస్థిత్వం గుర్తింపు గౌరవాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి దేశ భక్తి చాటాలని పిలుపునిచ్చారు.