దేశంలో రైతన్నల ఆగ్రహం కొనసాగుతోంది. పండించిన పంటకు కనీస ధర రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు నిప్పు పెడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓరైతు తన నిరసన వ్యక్తం చేశాడు. మార్కెట్ యార్డులో 160 కేజీల వెల్లుల్లి పంటకు నిప్పు పెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మందసౌర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే దియోలికి చెందిన శంకర్ సిర్పిరా అనే రైతు వెల్లుల్లి పంటను అమ్మేందుకు మార్కెట్ కు తీసుకొచ్చాడు.
అయితే మార్కెట్ లో వ్యాపారులు వెల్లుల్లి పంటకు సరైన ధర ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. దాదాపు 160 కేజీల వెల్లుల్లి పంటకు నిప్పు పెట్టాడు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు చేశాడు. తాను పండించిన పంటను మార్కెట్ తీసుకురావడానికి రవాణా ఖర్చులకే రూ.5000 అయ్యిందన్నాడు రైతు శంకర్. అయితే ఇక్కడ వ్యాపారులు మాత్రం తనకు కేవలం రూ.1100 మాత్రమే ఇస్తున్నారని తెలిపాడు. వెల్లుల్లి పంట సాగు కోసం మొత్తం రూ. 2.5 లక్షలు ఖర్చు పెట్టాడని పేర్కొన్నాడు. కానీ మార్కెట్ లో తనకు కేవలం రూ. 1 లక్ష మాత్రమే వచ్చిందని శంకర్ చెప్పాడు. పంటకు ధర లభించక పోవడం వల్లనే కాల్చివేసానని చెప్పుకొచ్చాడు.
శంకర్ మార్కెట్ లో పంటకు నిప్పు పెట్టే సమయంలో ఇతర పంటలకు మంటలు వ్యాపించకుండా మిగతా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై ప్రశ్నించేందుకు పోలీసులు రైతు శంకర్ ను స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు పోలీసులు.
Madhya Pradesh | A farmer set his 1 quintal of garlic on fire at Mandsaur Krishi Upaj Mandi, yesterday.
— ANI (@ANI) December 19, 2021
I invested Rs.2.5 lakhs in garlic, got only Rs.1 lakh. We do not want any bonus from the govt, just the right price for our crop: Shankar, farmer (18.12) pic.twitter.com/z30m0bhkZS