భోపాల్: నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనను సులభతరం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర సర్కార్ నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ)ను ప్రవేశపెట్టింది. ఎన్‌ఆర్‌ఏ విధానంతో కామన్ టెస్టు రాయడం వల్ల బహుళ పరీక్షలు రాసే బాధ తప్పడంతోపాటు నిరుద్యోగులు సమయం, డబ్బులను ఆదా చేయొచ్చని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌ఏ విధానాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్రాలు భావిస్తున్నాయి. అయితే అందరికంటే ముందుగా ఎన్‌ఆర్‌ఏ స్కోరు ప్రాతిపదికన ఎంప్లాయిమెంట్ కల్పించడానికి మధ్యప్రదేశ్ సర్కార్ ముందుకొచ్చింది. ఎన్‌ఆర్‌ఏలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన జాబ్స్ ఇవ్వనున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
‘ఎన్‌ఆర్‌ఏ స్కోర్ ప్రాతిపదికన యువతకు ఉద్యోగాలు కల్పించే ఈ అపూర్వమైన నిర్ణయాన్ని తీసుకున్న మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. నిరుద్యోగులు రిపీటెడ్ ఎగ్జామ్స్ వల్ల కలిగే భారీ ఖర్చుల నుంచి ఉపశమనం పొందడంతోపాటు ప్రయాణ సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. నా పిల్లల భవిష్యత్‌ను ఆనందించేలా, మెరుగ్గా తీర్చిదిద్దడమే నాకు ముఖ్యం’ అని శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.