భోపాల్ : కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలు ‘కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో’ యాత్రలుగా మారాయని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. సోమవారం భోపాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఆదివారం రాహుల్ గాంధీ మరో విఫల యాత్రను ముంబైలో ముగించారు. ఇప్పటివరకు ఆయన చేపట్టిన యాత్రలు ‘కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో’ గా మారాయి.
ఆయన యాత్రలు చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది లేదా నేతలు ఆ పార్టీని వీడారు” అని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చౌహాన్ నాలుగు ప్రశ్నలను సంధించారు. ‘‘అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ ఎందుకు తిరస్కరించింది..? పశ్చిమ బెంగాల్ లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఒక్క స్టేట్ మెంట్ ఎందుకు ఇవ్వలే?
ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్, ఇండియా కూటమి సంస్కృతా? రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ ఎందుకు ధైర్యం చేయలేదు?” అని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశ్నించారు.