గేదె పాలు ఇవ్వడం లేదని.. పోలీసులకు ఫిర్యాదు

గేదె పాలు ఇవ్వడం లేదని.. పోలీసులకు ఫిర్యాదు


కొన్ని సందర్భాల్లో పోలీసులకు సైతం చిత్ర విచిత్రమైన కేసులు వస్తుంటాయి. పిల్లి పారిపోయింది, కుక్క కిడ్నాప్ అయ్యింది అంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటం మనం చాలా సందర్భాల్లో చూశాం. అయితే తాజాగా  ఓ రైతు తన గేదె పాలివ్వడం లేదంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. అంతేకాదు... పాలు ఇవ్వకుండా తన గేదెపై ఎవరో మంత్రాలు కూడా ప్రయోగించారంటూ అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు అతడి ఫిర్యాదు విని ఒక్కసారిగా ఖంగు తిన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త హల్ చల్ చేస్తోంది. నయగాన్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

వివరాల్లోకి వెళ్తే.. భింద్ జిల్లా నయాగాన్ గ్రామానికి చెందిన  రైతు బాబులాల్ జాతవ్. అతడి వయసు 45 ఏళ్లు. అయితే బాబులాల్... శనివారం తన గేదెను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. తన గేదె పాలు తీసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వడం లేదంటూ.. ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని డిప్యూటీ సూపరిండెంటెండ్ అరవింద్ శర్మ పీటీఐకు తెలిపారు.  తన గేదెపై ఎవరో మంత్రాలు ప్రయోగించాని బాబులాల్ అనుమానం వ్యక్తం చేశాడు. అయితే తనకు ఈ విషయాన్ని కొందరు గ్రామస్థులు చెప్పారన్నారు. 

అయితే పోలీసులకు కంప్లైంట్ చేసిన నాలుగు గంటల తర్వాత గేదెను వెంటపెట్టుకొని మరోసారి స్టేషన్‌కు వెళ్లాడు రైతు బాబులాల్. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను అతను కోరాడు.  దీంతో పోలీస్ ఉన్నతాధికారులు గేదెను వెటర్నరీ వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని రైతుకు సలహా ఇచ్చారు.  ఆ తర్వాత మరోసారి ఆదివారం ఉదయాన్ని ఠానాకు వచ్చిన రైతు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. తన గేదె పాలు ఇస్తుందని తెలిపాడు. మొత్తం మీద రైతు విచిత్ర ఫిర్యాదుతో పోలీసులు ఒక్కసారిగా తలలు పట్టుకోవాల్సి వచ్చింది.