తాజ్ మహల్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఒక్కటే.. ప్రేమ. షాజహాన్ తన భార్య ముంతాజ్ పై ఉన్న అమర ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ కట్టించాడు. నేటీకీ ప్రేమ పక్షులకు తాజ్ మహల్ అంటే ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అప్పట్లో ఆ షాజహాన్ తన భార్య మరణించాక తన గుర్తుగా తాజ్ మహల్ కట్టిస్తే.. మధ్యప్రదేశ్ కు ఓ వ్యక్తి తన భార్యకు ఇంటినే తాజ్ మహల్ రూపంలో కట్టి కానుక ఇచ్చాడు.
మూడేళ్లు పట్టింది..
మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ కు చెందిన విద్యావేత్త ఆనంద్ ప్రకాశ్ చౌక్సీ తాజ్ మహల్ షేప్ లో ఇల్లు కట్టి తన భార్యకు గిఫ్ట్ ఇచ్చాడు. ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ వెళ్లిన సందర్భంలో దీనిలానే ఇల్లు కడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. దీంతో ఇంజనీర్లకు తన ఆలోచన చెప్పగా.. వాళ్లు త్రీడీ ఇమేజ్ బేస్ గా పెట్టుకుని ఈ అద్భుతమైన బిల్డింగ్ కట్టారు. దీనిని కట్టడానికి మూడేళ్ల సమయం పట్టింది. బయటి నుంచి పూర్తి తాజ్ మహల్ రూపంలోనే ఉన్న ఆ ఇంటి లోపల నాలుగు బెడ్రూమ్స్ ఉన్నాయి. రెండు ఫ్లోర్లలో రెండు బెడ్రూముల చొప్పున కట్టారు. కిచెన్, లైబ్రరీ, మెడిటేషన్ రూమ్ లాంటి కూడా ఈ నయా తాజ్ మహల్ లో ఉన్నాయి. దీని నిర్మాణానికి ప్రవీణ్ చౌక్సీ అనే ఇంజనీర్ సహకారం తీసుకున్నారు. దీనిని కట్టే ముందుగా అగ్రాలో తాజ్ మహల్ తోపాటు ఔరంగాబాద్ లో దానిని పోలి ఉండే బీబీ కా మఖ్ బరా కట్టడాన్ని కూడా పరశీలించి వచ్చినట్లు చెబుతున్నారు.